అతిసార వ్యాధి బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు వైద్యుల సూచనలను తప్పనిసరిగా ఆచరించాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
అతి సార వ్యాధి లక్షణాలు కనబడితే తక్షణమే సమీప ఆరోగ్య కేంద్రం వైద్యులను సంప్రదించాలి
బుధవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ఠ సమావేశమందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అతిసారా వ్యాధి నివారణ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అతిసారా వ్యాధిబారిన పడకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ వైద్యులు సూచించిన జాగ్రత్తలను పాటించాలన్నారు. ఈ ప్రచార కార్యక్రమం జూన్ 16వ తేదీ నుండి జులై 31వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ప్రతి పీహెచ్ సి పరిధిలో వైద్య సిబ్బంది ఇంటింటికి ఒఆర్ఎస్, జింక్ టాబ్లెట్ అందజేస్తున్నారన్నారు. పిల్లలు తల్లి పాలు తాగకపోవడం, తరుచుగా మల విసర్జన చేయడం, అరిచేతులు మరియు అరికాలు పసుపు పచ్చగా ఉండడం, ప్రతిదీ వాంతి చేసుకోవడం, తరచు అనారోగ్యానికి గురవడం వంటి లక్షణాలు కనబడితే తక్షణమే సమీప ఆరోగ్య కేంద్రం వైద్యులకు చూపించాలన్నారు. అతిసార వ్యాధి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ సబ్బుతో చేతులు శుభ్రంగా కడుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఎల్లప్పుడూ మరుగుదొడ్డి ఉపయోగించడం, సురక్షిత తాగునీరు తీసుకోవడం, తగినంత పోషకాహారం తీసుకోవడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత, వంట చేయడానికి ముందు, ఆహారం తినడానికి ముందు, జంతువులను తాకిన తర్వాత, పిల్లలకు ఆహారం ఇచ్చే ముందు, ప్రతి ఒక్కరూ సబ్బుతో చేతులను శుభ్రంగా కడుకోవాలన్నారు. అతిసార వ్యాధి బారిన పడినవారు ప్రతి విరోచనం తర్వాత ఒఆర్ఎస్ ద్రావణాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని, 14 రోజులపాటు ప్రతిరోజు జింకుమాత్ర వేసుకుని వైద్యులు సూచించిన ఆరోగ్య సూత్రాలను విధిగా పాటించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
ఈ సందర్భంగా “అతి సార వ్యాధి నుండి మీ పిల్లలను రక్షించండి” “అతిసార వ్యాధి నివారణ చర్యలు” ‘మీ చేతులు ఎప్పుడు కడుక్కోవాలి?” “ఓఆర్ఎస్ ద్రావణాన్ని తయారు చేయు విధానం” “ప్రమాద సంకేతాలు” పంటి నాలుగు గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. జి.గీతాబాయి, డి సి హెచ్ ఎస్ డా.పి.సూర్యనారాయణ, డిఈవో ఇ.నారాయణ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.సుధా లక్షీ, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, ఐ సి డి ఎస్ పి.డి. డి.లక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.