అతిధి దేవోభవ అనే ప్రాచీన సూక్తి ఏపి రంగానికి నిలువుటద్దంగా నిలబడుతుంది. రాష్ట్ర పర్యాటక, గృహా నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ …

ప్రపంచ పర్యటక రంగానికి ఏపి గమ్యస్థానంగా మారుతుంది.
రానున్న ఐదేళ్లలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో మొదటి స్థానంలో నిలిచేలా కృషి.
ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మహర్దశ.
భవిష్యత్తు అంతా పర్యటక రంగానిదే.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగంలో ఐదేళ్లలో దేశంలో ఏపిని మొదటి స్థానంలో నిలిపేందుకు లక్ష్యంగా పెట్టుకుని పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి, పలు పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు.
గురువారం పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలం కోపల్లె మంతెన హెరిటేజ్ నందు రాష్ట్ర పర్యాటక, గృహా నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రాష్ట్రంలో హోం స్టే విధానాన్ని అభివృద్ధి చేస్తూ, పర్యాటకులకు చక్కని అనుభూతి, తియ్యని జ్ఞాపకాలను పదిలం చేస్తుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,842 హోం స్టే యూనిట్లు విజయవంతంగా నడుస్తున్నాయని, ఒక తిరుపతి లోనే 561 హోమ్ స్టేలు పనిచేస్తుండటం విశేషం అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలు పర్యాటకులకు ఆకర్షణగా మారడం, వ్యవసాయ క్షేత్రాలు, పల్లె సంస్కృతి, హస్తకళలకు గల ప్రాధాన్యతను ప్రతిబింబించేలా ఈ విధానం సాగుతోంది అని అన్నారు. ఈ విధానానికి పశ్చిమగోదావరి జిల్లా కోపల్లెలోని మంతెన హెరిటేజ్ హోం స్టేకు ఆదర్శంగా నిలిచిందని ఇక్కడ వాతావరణం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందని అన్నారు. సెర్ప్, మెప్మా మహిళల భాగస్వామ్యంతో దిండి, అరకు ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టులకు శిక్షణ ఇస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. పెట్టుబడిదారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం, మెరుగైన రాయితీలు,ప్రోత్సాహాకాలు అందించడం అభినందనీయం అన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించిన 12 వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పర్యాటక రంగంలోని పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ, పర్యాటకానికి మద్దతుగా ఉండే వ్యవస్థలను బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. ఉప విభాగాలను అభివృద్ధి చేసుకుంటూ పర్యాటక రంగ సమగ్ర అభివృద్ధికి బాటలు వేసేలా ప్రభుత్వం నూతన పాలసీని రూపొందించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పర్యాటక విధానం ప్రకటించాక ఆతిథ్య రంగంలో ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయని, దీనిలో భాగంగానే ఇప్పటికే దాదాపు 18 వేల మందికి ఉపాధి అవకాశాలు 27 ప్రముఖ హోటళ్లు పనులు ప్రారంభించడం ఆహ్వానించ దగ్గ పరిణామం అన్నారు.ఒకప్పుడు భారతీయుల దృష్టిలో పర్యాటకమంటే తీర్ధయాత్రలు, పుణ్యక్షేత్రాలు మాత్రమే అనుకునే వాళ్ళం అని, ఇప్పుడు చారిత్రక, ప్రకృతిక ప్రదేశాల సందర్శనకు హోం స్టేకు పర్యాటకులు ఆకర్షితులు అవుతున్నారని తెలిపారు. మన రాష్ట్రం ఇటు దేవాలయాలు, పుణ్య క్షేత్రాలతో పాటు చారిత్రక, ప్రకృతి సౌందర్య స్థలాలకు నిలయం అని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల దేవస్థానం, శ్రీకాళహస్తి, శ్రీశైలం కాణిపాకం, విజయవాడ కనకదుర్గ దేవాలయం, సింహాచలం, అంతర్వేది,పుట్టపర్తి లాంటి పుణ్యక్షేత్రాలు, అరకు లోయ, బొర్రా గుహలు, పాపి కొండలు, హార్సిలీ హిల్స్, కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు లాంటి ప్రకృతిక ప్రదేశాలు, అమరావతి స్తూపం, ధవళేశ్వరం బ్యారేజ్ లాంటి చారిత్రక ప్రదేశాలు అనేకం ఉన్నాయని తెలిపారు. దేశంలోనే మూడవ అతిపెద్ద సముద్ర తీరం కలిగి ఉండడం రాష్ట్రానికి అదనపు ఆకర్షణ అని బ్లూ ఫాగ్ బీచ్‌గా ఎంపికైన రుషికొండ బీచ్‌తో పాటు, కాకినాడ, సూర్యలంక, మైపాడు, రామాపురం బీచ్‌లకూ బ్లూ ఫాగ్ గుర్తింపు సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. పర్యాటకులను మరింత ఆకర్షించేలా టెంపుల్, ఎకో, అడ్వెంచర్, వెల్‌నెస్, ఆగ్రిటూరిజంలను కలుపుతూ ప్రభుత్వం టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాజెక్టులను రూపొందిస్తున్నామని, దీనిలో భాగంగా కృష్ణానదిపై నీటిలో తేలియాడే రెస్టారెంటు (ఫ్లోటింగు రెస్టారెంటు), విజయవాడలో బెర్మ్ పార్క్, కోనసీమ బ్యాక్ వాటర్‌లో సింగిల్ బెడ్‌రూమ్ లగ్జరీ హౌస్ బోటులు ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. పోలవరం నుంచి పట్టిసీమ మధ్య తీగల వంతెన, విజయవాడ లోని భవానీ ద్వీపంలో థీమ్ పార్క్, వాటర్ పార్క్ లాంటివి ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనుమతితో మంత్రివర్గం ఆమోదం తర్వాతే కేటాయింపులు చేసేలా కొత్త విధానం రూపొందించడం జరిగిందన్నారు. రూ 50 కోట్ల కంటే తక్కువ పెట్టుబడులు పెట్టే సంస్థ (ఎంఎస్ఎంఈ) లకు బిడ్డింగు ప్రాతిపదికన భూమి కేటాయింపులు చేస్తామన్నారు. ఈ విధంగా పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం గత పది నెలల వ్యవధిలో కీలక నిర్ణయాలు తీసుకుందని, పర్యాటకులకు కావాల్సింది భద్రత, పరిశుభ్రత ఈ రెండూ లోపించినప్పుడు ఎంతటి అద్భుత సందర్శనీయ స్థలాలు ఉన్నా పర్యాటకులురారని తెలిపారు. అందుకే ప్రభుత్వం ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందని వీటితో పాటు పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం తయారుచేయడంపై జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. పర్యావరణం పర్యాటక రంగానికి జీవం అభివృద్ధి కోసం వేస్తున్న అడుగులు జీవావరణాన్ని ధ్వంసం చేయకుండా కూటమి ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుందిని తెలిపారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాజధాని అమరావతి ప్రాంతాన్ని కూడా చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మక, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం రాష్ట్రానికి మరింత కలిసొచ్చే అంశం మని అన్నారు. పర్యాటక రంగంపై మీడియా విస్తృత ప్రచారం కల్పిస్తే రాష్ట్ర అభివృద్ధితో పాటు యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు.
సమావేశంలో జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, టూరిజం సహాయ సంచాలకులు ఏ.లాజ్ వంతినాయుడు, మేనేజరు ఏ.రాజ్యలక్ష్మి, కన్సల్టెంటు డి.సాహితి, జిల్లా టూరిజం అధికారి ఏ.వి.అప్పారావు, డ్వామా పిడి డా.కె.సి.హెచ్. అప్పారావు, ఇంచార్చి హౌసింగు పిడి జి.పిచ్చయ్య, ఇఇ యం.శ్రీనివాసరావు, తహాశీల్దారు జి.సుందర్ సింగు, యంపిడివో డా.జి. స్వాతి, మంతెన హెరిటేజ్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.