అక్షరాస్యతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు
సోమవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో భీమవరం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం నుండి అన్ని జిల్లాలలో అక్షరాంద్ర పేరిట ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే వయోజనులు, నిరక్షరాస్యులు ఉన్నారో వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం లక్ష్యం అన్నారు. వయోజన విద్యా లక్ష్యం కేవలం అక్షరాస్యతకే పరిమితం కాకుండా వ్యక్తిగత అభివృద్ధి, సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి, జ్ఞాన నైపుణ్యాన్ని అందించడం, అక్షరాస్యత పెరగటం, నిరాక్షరాశుల జీవన ప్రమాణాలు మెరుగుపడటం, కొత్త నైపుణ్యాలు సంపాదించడం, ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి దోహదపడతాయని అన్నారు. అక్షరాస్యతా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ప్రతి ఒక్కరూ విద్యావంతులై వారి కుటుంబంలతో పాటు, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని అన్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు మెప్మా వాలంటరీలు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యాశాఖ ద్వారా ఏర్పాటు చేసినటువంటి లెర్నర్స్ ప్రైమర్లను, అలాగే వాలంటీర్ కి సంబంధించినటువంటి వాలంటీర్ సూచనల గైడ్ ను ఆవిష్కరించి, భీమవరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మెప్మా వాలంటీర్లకు జిల్లా జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అక్షరాస్యతా దినోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించినటువంటి పోటీలలో గెలుపొందినవారికి బహుమతులను అందజేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి ప్రకాశం చౌక్ వరకు వాలంటీర్లు, విద్యార్థులతో అక్షరాస్యత ర్యాలీని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వయోజన విద్య జిల్లా నోడల్ అధికారి కె .వి వి సత్యనారాయణ, మెప్మా పిడి ఏప్సీబా, డి ఆర్ డి ఎ డిపియం శ్రీనివాసరావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఎ.రాంబాబు, సీఎంఏం ప్రసాద్, సిఓలు, ఆర్ పి లు, మెప్మా వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.