​అంతర్జాతీయ సైన్ లాంగ్వేజ్ (సాంకేతిక భాష) దినోత్సవం, అంతర్జాతీయ బధిరుల వారోత్సవాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 28/09/2026

వైకల్యం చదువుకు అడ్డంకి కారాదని, ఎట్టి పరిస్థితి లోనూ చదువును మధ్యలో ఆపకూడదని ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

​ భీమవరంలోని డి.ఎన్.ఆర్. కాలేజీ శ్రీ రామకృష్ణ సభా మందిరంలో వికలాంగులు, ట్రాన్స్‌జెండర్లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, పశ్చిమ గోదావరి జిల్లా డెఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ సైన్ లాంగ్వేజ్ (సాంకేతిక భాష) దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
సమాజంలో బధిరులకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించడం, సాంకేతిక (సైన్) భాష ప్రాముఖ్యతపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం అన్నారు. ఈరోజు తమతో గడపడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. అంతర్జాతీయ బధిరుల వారోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాలోని బధిరులు అందరూ సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని తెలిపారు. వైకల్యం ఉన్నంత మాత్రాన తాము అనుకున్న లక్ష్యాలను సాధించడంలో నిర్లక్ష్యం వహించరాదని, తమలాంటి వారికి గ్రాహ్య శక్తి
ఎక్కువగా ఉంటుందని అన్నారు. తాము పట్టుదలతో ఉన్నత చదువులు అభ్యసిస్తే తప్పక లక్ష్యం సాధించగలుగుతారని అన్నారు. ఆటల్లో, చదువులో తమకు ఎటువంటి సమస్య ఎదురైన ప్రభుత్వ యంత్రాంగం తమకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఐదుగురు బధిరులకు స్మార్ట్ ఫోన్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ పిల్లలతో కలిసి కేక్ కటింగ్ చేసి వారికి ఆప్యాయతగా తినిపించారు. బధిరులు వారి సంకేతాలను జిల్లా కలెక్టర్ వారికి తెలియజేస్తూ ఆనందోత్సాహం తెలిపారు.
​​ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల చివరి ఆదివారం నాడు “ప్రపంచ బధిరుల దినోత్సవం” నిర్వహించుకోవటం జరుగుతున్నదని, దీనిలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో సెప్టెంబర్ 27, ఆదివారం నాడు నిర్వహించడమైనదన్నారు
సెప్టెంబర్ 21 నుండి 27 వరకు అంతర్జాతీయ బధిరుల వారంగా పాటిస్తారన్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 23ను “అంతర్జాతీయ సాంకేతిక భాషా దినోత్సవంగా” జరుపుకుంటారన్నారు. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ సంస్థ ఈ దినోత్సవాన్ని ప్రారంభించిందన్నారు.
బధిరుల హక్కులు, సమాజంలో వారి భాగస్వామ్యం, సమాన అవకాశాల గురించి ప్రపంచానికి తెలియజేయడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ​సైన్ లాంగ్వేజ్ (సాంకేతిక భాష) ప్రాముఖ్యతను ప్రజలకు తెలిసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ​విద్య, ఉద్యోగం లో సమాన అవకాశాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బధిరులకు సాంకేతిక భాష ప్రసార సాధనంగా, సంభాషణ మాధ్యమంగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ​’సదరం’ సర్టిఫికేట్ ద్వారా వైద్య ధృవీకరణ,
​ఉచిత కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు,
​ఉచిత వినికిడి పరికరాల పంపిణీ వంటివి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
వీరికి ​ప్రత్యేక పాఠశాలలు, స్కాలర్‌షిప్‌ల సౌకర్యం అందిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు పశ్చిమ గోదావరి జిల్లా డెఫ్ అసోసియేషన్, డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం కలిసి మెమోంటో, దృశ్యాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా డెఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్. ఉమామహేశ్వరరావు, జనరల్ సెక్రటరీ తోట రాము, ప్రముఖ సాంఘిక సంఘసంస్కర్త చెరుకూరి రంగస్వామి, డిఫ్ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ సిహెచ్ తాతారావు, టిటిడి బధిరుల పాఠశాల విద్యార్థులు, డి ఎన్ ఆర్ కళాశాల వైస్ ప్రెసిడెంట్ పాండురంగారావు, డిఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు.