అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల సాధికారతకు మరింత బలం చేకూర్చే దిశగా మార్చి 2 నుండి మార్చి 20 వరకు జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు.
కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మహిళా సాధికారత కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత అంశమని తెలిపారు. మహిళల ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వావలంబన, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై సమాజంలో విస్తృత అవగాహన అవసరమని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, డిఆర్డిఏ, మెప్మా, విద్యా శాఖ, కార్మిక శాఖ, స్కిల్ డెవలప్మెంట్ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా మహిళల మానసిక ఆరోగ్యం పరిరక్షణ, గృహ హింస నిరోధం, మహిళా హక్కులపై అవగాహన, ఉపాధి మరియు స్వయం ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, రుణ మేళాలు, సైబర్ సెక్యూరిటీపై జాగృతి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే ప్రధానమంత్రి మాతృ వందన యోజన వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై లబ్ధిదారులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని తెలిపారు. మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ర్యాలీలు, ఇంటరాక్టివ్ సెషన్లు, ప్రత్యేక శిబిరాలు, “కుకింగ్ ఫర్ మెన్” వంటి సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలం, పట్టణ స్థాయిలో కార్యక్రమాలు ఫలప్రదంగా జరిగేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, ఐసిడిఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి, డిఆర్డిఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డ్వామా పీడీ డాక్టర్ కె.సి.హెచ్ అప్పారావు, డీఎంఅండ్హెచ్ఓ జి.గీతాబాయి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.