సంపాదించడం ఎంత ముఖ్యమో సమాజ సేవకు దాతృత్వం కలిగి ఉండడం అంతే ముఖ్యమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు .
బుధవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశం మందిరం నందు బి.వి రాజు (విష్ణు కాలేజ్) విద్యాసంస్థల చైర్మన్ కె.వి విష్ణు రాజు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ని కలిసి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ బివి రాజు కళాశాలల యాజమాన్యం పెద్ద మొత్తంలో సహాయం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. సంపాదించడం ఒక్కటే ముఖ్యం కాదని, దాతృత్వం కలిగి ఉండటం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఈ విషయంలో బివి రాజు విద్యాసంస్థలు ముందు వరుసలో నిలుస్తాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బివి రాజు విద్యాసంస్థలలో లక్షలాదిమంది విద్యను అభ్యసించి ప్రయోజకులు కావడానికి ఆనాడు బీవీ రాజు ముందు చూపుతో గొప్ప దాతృత్వం కలిగి ఉండటం కారణమని, దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. నూతన జిల్లాగా ఏర్పడి సరైన మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో బీవీ రాజ విద్యాసంస్థలు వసతి గృహాలు, సమావేశ మందిరాలను వినియోగించుకోవడానికి జిల్లా యంత్రాంగానికి నిరంతర సహాయ సహకారాలు అందించడం ఎంత ముదావహం అని కొనియాడారు. పశ్చిమగోదావరి జిల్లా నుండి నేటి వరకు 13 మంది దాతలు రూ.47,88,500/- లు వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో అభినందనీయం అన్నారు. అలాగే దాతలు పెద్ద ఎత్తున వరద బాధితులకు వివిధ ఆహారం పదార్థాలను అందజేసి పశ్చిమగోదావరి జిల్లా దాతృత్వంలో మొదటి స్థానంలో నిలిపారన్నారు. 4.09 లక్షల ఆహార పొట్లాలు, 1.85 లక్షల వాటర్ బాటిల్స్, 1.10 లక్షల వాటర్ ప్యాకెట్లు, 9,500 బన్నులు, 21,400 రస్కులు, 1.62 బిస్కెట్ ప్యాకెట్లు, 25 కేజీల వైస్ బ్యాగ్స్ 700 అందజేయడం జరిగింది అన్నారు. అలాగే కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, స్నాక్స్, అరటిపళ్ళు, జామకాయలు, పాలు, రొట్టెలు, కూరగాయలు నిత్యవసర వస్తువులు దుప్పట్లు ముందుల కిట్లు పెద్ద ఎత్తున ప్రత్యేక వాహనాలు ద్వారా విజయవాడకు పంపడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలిగిన జిల్లా ప్రజలు తమ దాతృత్వాన్ని చాటుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు. విజయవాడ వరద బాధితులను ఆర్థికంగా ఆదుకునేందుకు మరింతమంది సహాయం అందించడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
బీవీ రాజు విద్యాసంస్థల చైర్మన్ కె.వి విష్ణు రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ వరదలను చూసి చెలించిపోయానన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం నిరంతరం ఎంతో సహాయం చేస్తున్న, మా వంతుగా ఎంతోకొంత సహాయం చేయాలని నిర్ణయించుకొని ఈరోజు వరద బాధితులకు అండగా నిలిచేందుకు రూ.25 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ కు అందజేయడం జరిగిందన్నారు. విష్ణు విద్యాసంస్థల ద్వారా లక్షలాది మందికి విద్యను అందించి, మంచి భవిష్యత్తు కలగజేయాలని బివి రాజు ఆశయాలకు అనుగుణంగా నిరంతరం శ్రమిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జె .ఉదయభాస్కరరావు పాల్గొన్నారు.