Close

సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, దీనికి అనుగుణంగా మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు కష్టించి పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు.

Publish Date : 09/02/2026

రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్ సమావేశ మందిరం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం మంత్రులు, కార్యదర్శులతో సమావేశమై సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు ఆయా జిల్లాల నుండి వర్చువల్గా పాల్గొన్నారు.

భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగం అనంతరం, వివిధ శాఖల కార్యదర్శులు, ఆ శాఖల మంత్రులతో కలిసి ఆయా శాఖలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పలు అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయా శాఖల కార్యదర్శులకు, జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలలవారీగా సమీక్షించుకుని, క్షేత్రస్థాయిలో పనుల్ని బేరీజు వేసుకోవాలన్నారు. ప్రతీ నెలా రెండు సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించి, ఎస్ఐపీబీ ద్వారా ప్రాజెక్టులకు ఆమోదం ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇంచార్జ్ మంత్రులు కూడా అదే వేగంతో క్షేత్రస్థాయిలో పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. గత 19 నెలల నుండి వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టగలిగాం అన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని, తల్లికి వందనం ద్వారా రూ.10 వేల కోట్ల తల్లుల ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు. స్త్రీశక్తి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ద్వారా మొబిలిటి పెరిగిందని , 4.29 కోట్ల ప్రయాణాలు ఇప్పటి వరకూ జరిగాయన్నారు. అన్నదాత సుఖీ భవ ద్వారా రూ. 6,310 కోట్ల ఆర్ధిక సహకారం అందించాం అన్నారు. రాయలసీమలో హార్టి కల్చర్ హబ్, కోస్తాలో ఆక్వా కల్చర్ పెంచేలా చర్యలు చేపట్టాం అన్నారు. దీపం.2.0 ద్వారా 2 కోట్ల సిలెండర్లు ఇప్పటి వరకూ ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రూ.58 వేల కోట్ల మేర ఆర్ధిక చేయూత అందించాం అన్నారు. సంక్షేమ పథకాలు అవసరమా…? అనే చర్చ సరి కాదని , పేదలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అవసరమే అని వెల్లడించారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పల్లె పండుగ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 11,328 కోట్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా రూ.10 వేల కోట్ల విలువైన పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. తక్కువ ఆర్ధిక వనరులతోనే రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రప్రభుత్వానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారని తెలిపారు. నిధుల కొరత ఉన్నప్పటికీ నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. క్షేత్రస్థాయిలో ఉదాసీనత లేకుండా పని చేయాలని, దీనిని అధిగమించేలా కార్యచరణ ఉండాలని ఆదేశించారు. ఈ గ్యాప్స్ ను సవరించుకుని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో అమలు అవుతున్న కార్యక్రమాల్ని పర్యవేక్షించాలని తెలిపారు.

శాంతి భద్రతలపై డీజీపీ, జిల్లా ఎస్పీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షిస్తూ…

రోడ్ ప్రమాదాలు గణనీయంగా తగ్గాలన్నారు. రోడ్ ప్రమాదాలు తగ్గేందుకు హోం, ఆర్ అండ్ బి శాఖలు కార్యాచరణ చేపట్టాలి. తీవ్ర నేరాల కట్టడి విషయంలో కొన్ని జిల్లాలు ఇంకా మెరుగైన పనితీరు కనబర్చాలన్నారు. ఇకపై శాంతిభద్రతల విషయంపై ప్రతి నెల సమీక్ష ఉంటుందన్నారు. పోలీసింగ్ లో టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ గంజాయి సాగుకు వీల్లేదని హెచ్చరించారు. డీ-అడిక్షన్ సెంటర్లతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ద్వారా మద్యం, డ్రగ్స్ కు బానిసలైన వారిని మార్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసింగ్ లో సక్సె్స్ స్టోరీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత హనానికి పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం అని హెచ్చరించారు. 16 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలను వినియోగాన్ని నియంత్రించేలా ఓ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ వివాదాల వల్లే ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయని , బాధితులకు కౌన్సిలింగ్ ఇప్పించే వ్యవస్థను తీర్చిదిద్దాలని ఆదేశించారు.

సమీక్షలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్డబ్ల్యూఎస్, వైద్యశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఆర్టిసి, విద్యుత్ శాఖ, ఆర్టిజిఎస్, టెక్నాలజీ తదితర శాఖలోని వివిధ అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు.