Close

శివారు భూములకు సాగునీరు సరఫరా చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 03/02/2026

సాగునీటి పంపిణీలో రైతులకు ఇబ్బందులేని విధంగా జల వనరుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి…

ఓ అండ్ ఎం లో మంజూరు కానీ పనులను గుర్తించి అత్యవసరపనులకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలి…

ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సహాయ సహకారాలు అందించాలి..

రబి సాగుకు వంతుల వారి విధానం ద్వారా సాగునీరు సరఫరాపై ప్రజా ప్రతినిధులకు, రైతులకు పూర్తి సమాచారాన్ని అందించాలి.

జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం ఇరిగేషన్ శాఖ పై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఇరిగేషన్, డ్రైన్స్ అధికారులు సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులతో సమీక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో రాష్ట్ర పీఏసీ చైర్మన్ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, తణుకు శాసనసభ్యులు ఆరు మిల్లి రాధాకృష్ణ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల సాగునీటి సంఘాల అధ్యక్షులు మురళి కృష్ణంరాజు హాజరయ్యారు.

సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 31వ తేదీన జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో జిల్లాలో రబి కి సంబంధించి సాగునీటి సరఫరాపై నియోజకవర్గాల వారీగా సమస్యల పరిష్కారంపై సాగు నీటి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో రభీ పంటకు సాగునీరు సరఫరాకు అమలు చేస్తున్న ప్రణాళికను తెలియజేయవలసిందిగా ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు జిల్లాలో ఆయకట్టు వివరాలు, వంతులు వారీగా సాగునీటి సరఫరా, నీటి లభ్యత, కాలువల మూసివేత అనంతరం చేపట్టే పనులపై శాసనసభ్యులు సమక్షంలో వివరించారు. రైతుల వద్ద నుండి వాటర్ టాక్స్ కట్టించడానికి నీటి సంఘం సభ్యులు అవగాహన కల్పించాలని, సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని, పక్కా ప్రణాళికతో సాగునీటి విడుదల చేపట్టాలన్నారు. ఓ అండ్ ఎం లో కవర్ కానీ పనులకు ప్రతిపాదన తయారుచేసి సమర్పించాలన్నారు.

తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి కాలువ మురుగు కాలువలను తలపిస్తున్నాయని, దుర్భరమైన పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్న అన్నారు. మురుగునీరు కాలువలనులోకి వెళ్లకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కాలువలలోని పూడికడికలను తొలగించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. పురపాలక సంఘాల పరిధిలోని మురుగునీరు కాలువలలోకి కలవకుండా ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. మురుగునీరు కాలువలను పూర్తి ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. నియోజకవర్గంలో రైతులు డ్రైన్లను ఆక్రమించడం ద్వారా సాగునీటికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని, స్వచ్ఛందంగా వాళ్ళు తిరిగి అప్పగించాలన్నారు. నియోజకవర్గంలో సాగునీటి సమస్యలకు రూ.1.79 కోట్లు ఖర్చు చేస్తే సుమారు 12 వేల వరకు ఎకరాల వరకు ముంపు తగ్గుతుందన్నారు. పందికోడు దగ్గర అడ్డుకట్ట వేసి రైతుల వ్యవసాయం చేస్తున్నారని దీనికి కారణంగా శివారు భూములకు నీటి ఎద్దడి ఏర్పడుతుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో కాలువలోనికి చెత్త వేయకుండా ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.

పి ఏసీ చైర్మన్, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ కాలువలు, డ్రైన్స్ సంబంధించి చేపట్టవలసిన పనులకు ఫిబ్రవరి నెలాఖరు నాటికి టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి, పాలు కట్టేసే నాటికి చేయవలసిన పనులకు సిద్ధంగా ఉండాలన్నారు. కాలువలు మూసివేత తర్వాత టెండర్ల ప్రక్రియ మొదలుపెడితే పనులు చేపట్టడానికి సమయం సరిపోదని, దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రబి సాగుకు సాగునీరు సరఫరాలో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో రబి పంటకు ఎటువంటి సాగునీటి సమస్య లేకుండా అధికారులు సమయముతో పనిచేయాలన్నారు. ఇరిగేషన్, డ్రైన్స్ ఇంజనీరింగ్ అధికారులు గతంలో చేపట్టిన పనులు, వివిధ పనులకు ఉన్నతాధికారులకు పంపిన ప్రతిపాదనలు, అంచనా వ్యయం, తదితర సమాచారాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకునే విధంగా ఉండాలన్నారు. వంతులు వారి విధానం ద్వారా సాగునీరు సరఫరా తేదీల సమాచారాన్ని ప్రజాప్రతినిధులకు, రైతులకు ముందుగా తెలియజేయాలన్నారు. ప్రణాళిక లేకుండా కాలవలు వదలడంతో చేపల చెరువులు, రొయ్యల చెరువులు నింపుకొని, మిగతా నీరు పంట పొలాలు ముంపుకు గురిచేస్తుంది అన్నారు. అధికారులు సాగునీటి విడుదలపై గత చరిత్రను తెలుసుకుని పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.

ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో రబి సాగు ఆయకట్టు విస్తీర్ణం, వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు, రబి పంటకు సాగునీరు లభ్యత, తదితర వివరాల గణాంకాలు కావాలని కోరగా సంబంధిత ఎస్ ఇ సమావేశంలో లేకపోవడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. ఇక మీదట సమీక్ష సమావేశాలకు తప్పనిసరిగా జిల్లా అధికారులు హాజరు కావాలన్నారు. తాను కోరిన సమాచారాన్ని సమగ్రంగా కచ్చితత్వంతో అందజేయాలన్నారు. జిల్లాకు సంబంధించి ఏ కార్యక్రమం చేపట్టిన సంబంధిత సమాచారాన్ని గణాంకాలను తప్పనిసరిగా ప్రజా ప్రతినిధులు అందజేయాలన్నారు. జిల్లాల విభజన జరిగి సుమారు మూడు సంవత్సరాలు అవుతున్న కొత్త జిల్లాకు పూర్తిస్థాయి అధికారులు లేకపోవడం ఇబ్బందికరమైన పరిస్థితి అని వ్యాఖ్యానించారు.

డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దర్భరేవును ప్రక్షాళన చేయాలని, అలాగే రుస్తుంబాధ డీసిల్టింగ్ చేయాలని కోరారు. నక్కల డ్రైన్ పూడిక వలన 4 మండలాల్లోనీ శివారు ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న అన్నారు. కాలువలు కట్టేయడానికి ఖచ్చితమైన తేదీని పాటించడం లేదని, గడువు తేదీ నుండి వారం వారం పెంచుకుంటూ పోవడంతో ఓ అండ్ ఎం పనులు చేయడానికి సమయం సరిపోవడం లేదని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల సాగునీటి సంఘాల అధ్యక్షులు మురళి కృష్ణంరాజు, ఇరిగేషన్ ఈఈ యు.సురేష్, డ్రైన్స్ ఈఈ సత్యనారాయణ, ఇరిగేషన్, డ్రైన్స్ ఇంజనీరింగ్ అధికారులు, నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల అధ్యక్షులు, నీటి సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.