Close

విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేగిరాజు శివ వర్మ చేస్తున్న ప్రాతళ్ళమెరక అభివృద్ధి అభినందనీయమని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు కొనియాడారు.

Publish Date : 21/02/2026

విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ 30వ వార్షిక వేడుకలు సందర్భంగా నిర్వహిస్తున్న అభివృద్ధి పథంలో ప్రాతళ్ళమెరక కార్యక్రమంలో భాగంగా సుమారు ఒక కోటి రూపాయల వ్యయంతో సిసి రోడ్లు నిర్మాణం చేసిన మంచినీటి చెరువు, మైక్రో ఫిల్టర్, మంచినీటి పైపులైను, సీసీ కెమెరా సిస్టం ఏర్పాటును, సుమారు రూ.1.25 కోట్ల వ్యయంతో గ్రామ మురుగునీటిపారుదల కోసం చేసిన డ్రైనేజ్ సిస్టంను, సుమారు రూ.50 లక్షల వ్యయంతో చినపేట మంచినీటి చెరువు సంరక్షణ కొరకు కట్టిన వాల్, వాకింగ్ ట్రాక్, సిసి రోడ్లను, సుమారు రూ.25 లక్షల వ్యయంతో స్వర్గీయ వత్సవాయి రాధామణి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను, స్వర్గీయ వత్సవాయి సూర్యనారాయణ రాజు ప్రజా వైద్యశాల పునః ప్రారంభం, అంబులెన్స్, తదితర సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో చెప్పిన పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్ర వర్మ, బాపట్ల మాజీ శాసనసభ్యులు మంతెన అనంత వర్మ శనివారం కాళ్ల మండలం ప్రాతళ్ళమెరకలో సంయుక్తంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ పట్టణానికి మించిన పల్లెగా ప్రాతళ్ళమెరక అభివృద్ధి ఉందంటే దీని వెనుక విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ వేగిరాజు శివ వర్మ కృషి ఎంతో ఉందన్నారు. వారి కృషితోనే ప్రాతళ్ళమెరక అభివృద్ధి జిల్లాలోనే చెప్పుకోదగినదిగా నిలిచిందన్నారు. ప్రతి ఒక్కరు వారి స్వస్థలానికి ఎంతో కొంత చేస్తే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు తోడై ఆ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి అన్నారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి దాతలు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం, ప్రవేటు భాగస్వామ్యంతో మరింత అభివృద్ధిని సాధించవచ్చు అన్నారు. ప్రాతళ్ళమెరక అభివృద్ధిలో విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వేగిరాజు శివ వర్మ కృషి ఎంతో ఘనమైనదన్నారు. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమాలలో ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్ర వర్మ, బాపట్ల మాజీ శాసనసభ్యులు మంతెన అనంత వర్మ, ప్రాతళ్ళమెరక సర్పంచ్ ఉష, విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ దంపతులు వేగిరాజు శివ వర్మ, సుజాత, కంతేటి వెంకటరాజు, కంతేటి శ్రీనివాసరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.