వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ అందిస్తున్న సేవలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, వీరవాసరం రైల్వే స్టేషన్ రోడ్డు కొత్తపేట సచివాలయం.2 లో సంబంధిత అధికారులు, సచివాలయం సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఇంటింటికి వెళ్లి వాట్సాప్ గవర్నెన్స్ ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. వాట్సప్ గవర్నెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మన మిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం ద్వారా వాట్సాప్ గవర్నర్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగనవసరం లేకుండా మీ మొబైల్ ద్వారా మన మిత్ర వాట్సాప్ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. పిల్లలకు చదువులకు అవసరమైన సర్టిఫికెట్లతో సహా సుమారు 700 సేవలు వరకు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా బయటకు వెళ్లకుండా ఇంటి వద్ద నుండే పొందవచ్చునని అన్నారు. బ్రోచర్లను స్వయంగా జిల్లా జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రజలకు అందజేశారు. స్థానిక ప్రజలు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి కి పలు సమస్యలను తెలిపారు. త్రాగునీరు శుభ్రముగా రావడం లేదని, పంట బోదే కలుషితమై డ్రైనేజీగా మారిందని సమస్యలను తీర్చాలని కోరారు. వారు వినియోగిస్తున్న త్రాగు నీరును బాటిల్స్ తో తీసుకువచ్చి చూపించారు. జాయింట్ కలెక్టర్ వాటర్ ను పరిశీలించి పంచాయతీ సిబ్బందిని ప్రశ్నించగా రా వాటర్ శుద్ధి చేసిన మాత్రమే ఇవ్వటం జరుగుతుందని పంచాయతీ సిబ్బంది తెలియజేయడం జరిగింది. ఎక్కడైనా పైపులు లీకేజ్ ఉంటే పరిశీలించి చర్యలు తీసుకోవాలని, పంట బోదే కలుషితం కాకుండా డ్రైన్ ఏర్పాటు చేయాలని పంచాయతీ సెక్రటరీ ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది క్యాంపెయిన్ నిర్వహించి ప్రతి కుటుంబానికి మన మిత్ర యాప్ సేవలపై అవగాహన కల్పించాలని అన్నారు. వాట్సప్ ద్వారా డిజిటల్ సేవలను వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే మనమిత్ర వాట్సాప్ ఆధారత సేవలపై డోర్ టు డోర్ తిరగాలని జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఆదేశించారు. గ్రామ సెక్రటరీలు వారి పరిధిలో అన్ని ఇళ్ళను కవర్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. గ్రామ రెవెన్యూ అధికారులు రెవెన్యూ ల్యాండ్ సంబంధిత సేవలపైన, విద్యుత్ అధికారులు విద్యుత్ బిల్లులు, కొత్త కనెక్షన్లు, ఫిర్యాదుల పైన అగ్రికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్, ఏఎన్ఎం సిబ్బంది ప్రచారంలో పాల్గొని సంబంధిత శాఖలకు సంబంధించిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సచివాలయాల సిబ్బందికి అవసరమైన ప్రచార లాజిస్టిక్స్ సపోర్టును అందించి ప్రతి శుక్రవారం మనమిత్ర డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొనాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంలో జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, తహసిల్దార్ రామాంజనేయులు, ఎంపిడిఓ కె.ఎం వైభావతి, డిప్యూటీ ఎంపిడిఓ దుర్గాప్రసాద్, సిఎస్డిటి కిషోర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి కె.లక్ష్మీ, సర్పంచ్ సి.హెచ్ మంగతయారు, మాజీ ఎంపీపీ వీరవల్లి చంద్రశేఖర్, పంచాయతీ, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.