వరి పంట దెబ్బతిన్న కౌలు రైతులు నమోదులో ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు .
శుక్రవారం కాళ్ల మండలం కాళ్ల గ్రామంలో అధిక వర్షాలు కారణంగా నీట మునిగిన వరి పంట పొలాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించి, ఎన్యుమరేషన్ జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. పంట నమోదులో అర్హత కలిగిన ఏ ఒక్క కౌలు రైతు మిస్ అవకుండా నమోదు చేయాలని, అలాగే అర్హత లేని ఏ ఒక్కరిని నమోదు చేయకూడదని ఆదేశించారు. ఏదైనా తప్పు జరిగినట్లు తన దృష్టికి వస్తే చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. కాళ్లలో 90 ఎకరాలు వరి పంట నీట మునిగిందని తెలిపారు. నష్టపోయిన పంట నమోదు జాబితాను రైతు సేవ కేంద్రంలో సోషల్ ఆడిట్ నిమిత్తం ప్రదర్శించడం జరిగిందని, రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. అలాగే పంట దెబ్బతిన్న వివరాలు వెబ్సైట్ నందు నమోదు ఎంతవరకు వచ్చింది అని అడిగి తెలుసుకున్నారు. వెంటనే నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంలో రైతులు జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ వారం పది రోజులు నీరు పంట పొలాల్లో నిలబడటం వలన దుబ్బులు పూర్తిగా కుళ్ళిపోయి నేలకొరగడం జరుగుతుందని పూర్తిగా నష్టపోయామని, మళ్లీ ఖరీఫ్ సాగుకు సమయం సరిపోదని వివరించారు.
పంట పొలాల పరిశీలన సందర్భంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, ఆకివీడు ఏడిఏ కే ఎస్ ఎస్ శ్రీనివాస్, ఎంఏఓ జయ వాసుఖి, ఆర్.ఐ, వీఆర్వో, వీఐఏ, తదితరులు ఉన్నారు.