రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ద్వారా అమ్మి లాభం పొందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.

గురువారం తాడేపల్లిగూడెం మండలం మోదుగగుంట గ్రామంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు వాట్సాప్ సేవలు సద్వినియోగం చేసుకుని తమ ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు రైతు సేవ కేంద్రాలు ద్వారా అమ్ముకోవచ్చు అన్నారు. ధాన్యం రైతు సేవా కేంద్రానికి చేరిన 48 గంట ల్లోపు తమ ఖాతాల్లో సొమ్ము జమ అవుతుందని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వ్యవసాయ, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తారని అన్నారు. రైతులకు రాయితీపై
మినుములు, పెసలు, నవధాన్యాలను ప్రభుత్వం అందిస్తున్న రాయితీతో పొందాలని అన్నారు. మినుములు కేజీ రూ.70, పెసలు రూ.65, నవధాన్యాలు 10 కేజీలు రూ.800 లు చొప్పున రాయితీపై రైతు సేవా కేంద్రం నుండి పొందవచ్చునని అన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రైతులను కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని రబీ సీజన్లో పండించిన ధాన్యమునకు క్వింటాకు సాధారణ రకం రూ.2300 లు,
ఏ గ్రేడ్ క్వింటాకు రూ.2320 లు గిట్టుబాటు ధర కల్పించడం జరిగిందని అన్నారు. రైతులు మధ్య దళారులు మాటలు నమ్మకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యమును అమ్ముకొని ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటు ధరను పొందాలని అన్నారు. గత ప్రభుత్వంలా కాకుండా మిల్లులకు దాన్యము తోలిన కొన్ని గంటలలోపే రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఖతిబ్ కౌసర్ భానో, జిల్లా సివిల్ సప్లై మేనేజర్ టి .శివరాం ప్రసాద్, డీఎస్ఓ ఎన్ సరోజ, డి సి ఓ ఎం నాగరాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఏ డి ఏ పి మురళీకృష్ణ ,తాసిల్దార్ ఎం సునీల్ కుమార్, రెవిన్యూ వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు