రిజిస్ట్రేషన్ లపై అవగాహన సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
భీమవరం, గునుపూడి సబ్ రిజిస్టర్ కార్యాలయం-1 నందు రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై మంగళవారం ప్రజలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లు ప్రక్రియలో భాగంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా ఏ విధమైన సేవలు ప్రజలకు అందుతాయి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా చేసుకోవాలి సంబంధిత అంశాలను ఈ సదస్సుల ద్వారా వివరించటం జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, స్లాట్ బుకింగ్, పిడిఈ, హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్, ఈసీ, మార్కెట్ వ్యాల్యూ, అర్బన్ మ్యుటేషన్, ఎనీవేర్ రిజిస్ట్రేషన్స్, పిజిఆర్ఎస్ గురించిన సమాచారాన్ని వివరించారు. ప్రజా ప్రయోజనార్థం ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ప్రభుత్వ ఉత్తర్వులు 478 ప్రకారం వారసత్వ వ్యవసాయ భూముల పార్టిషన్ దస్తావేజు రిజిస్ట్రేషన్ కొరకు మార్కెట్ విలువ రూ.10 లక్షల లోపు ఉన్నచో స్టాంప్ డ్యూటీ రూ.100/, రూ.10 లక్షల కన్నా ఎక్కువ ఉన్నచో స్టాంప్ డ్యూటీ ఒక వెయ్యి రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ సేవలు వినియోగించుకోవచ్చని తెలియజేశారు. భీమవరం మున్సిపల్ ఏరియాలోని భీమవరం గునుపూడి గ్రామంలోని ఇళ్ళు, ఖాళీ స్థలములకు రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే పన్ను రసీదు మ్యుటేషన్ జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్ కు వచ్చిన వారు అప్పటి వరకు ఉన్న పన్ను బకాయిలు చెల్లించి, పన్ను రసీదును తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. మ్యుటేషన్ కొరకు మార్కెట్ విలువ రూ.20 లక్షలు లోపు 1,000 రూపాయలు, ఆపైన ప్రతి లక్షకు వంద రూపాయలు చొప్పున కలిపి మ్యుటేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే కొనుగోలు దారుని పేరున పన్ను రసీదులో పేరు మ్యుటేషన్ జరుగుతుందని వివరించారు. ప్రజలు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏటువంటి మధ్య దళారులు ప్రమేయం లేకుండా స్వయంగా రిజిస్ట్రేషన్లు చేసుకునే విధంగా ఈ అవగాహన సదస్సుల ద్వారా తెలుసుకుని రిజిస్ట్రేషన్ సేవలు వినియోగించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు.