రామకృష్ణ మఠం సేవా దృక్పథంతో వందమంది తీర ప్రాంత మత్స్యకారుల జీవన అభివృద్ధికి చేసిన సహాయం మరువలేనిదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
బుధవారం నరసాపురం మండలం పెదమైనవాని లంక డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ నందు రామకృష్ణ మఠం మిషన్ ఆధ్వర్యంలో మత్స్యకారుల జీవన అభివృద్ధి కొరకు పేద మత్స్యకారులతో ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాజమండ్రి రామ కృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పేద మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికి తోడ్పాటు అందిస్తున్న రామకృష్ణ మఠం మిషన్ నిర్వాహకులకు తొలుత కలెక్టర్ అభినందనలు తెలిపారు. మొoతా తుఫాన్ కారణంగా నరసాపురం తీర ప్రాంతంలో నష్టపోయిన ప్రజలకు తమ వంతు సహాయం అందించడానికి రామకృష్ణ మఠం ముందుకు వచ్చిందని, ప్రస్తుతం ప్రభుత్వం వారికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నదని, కానీ పేద తీర ప్రాంత మత్స్యకారుల భృతికి ఉపయోగపడే ఉపకరణాలను అందించవలసిందిగా కోరడం జరిగిందన్నారు. ఈ సందర్భంలో మొగల్తూరు, నరసాపురం తీర ప్రాంతంలోని వందమంది పేద మత్స్యకారులను మత్స్య శాఖ అధికారుల ద్వారా ఎంపిక చేయడం జరిగిందని, వారితో నేడు స్వామీజీ సమక్షంలో సమావేశం అవడం జరిగిందన్నారు. 50 వేల రూపాయల విలువ కలిగిన సాంప్రదాయ పడవ, 20 వేల రూపాయలు విలువ కలిగిన వల ఒక్కొక్క లబ్ధిదారునికి రామకృష్ణ మఠం మిషన్ నిధులతో సమకూర్చడం జరుగుతుందన్నారు. రామకృష్ణ మఠం మిషన్ దేశవ్యాప్తంగా 300 పైగా కేంద్రాలను కలిగి ఉందని, మానవసేవే మాధవసేవ అని నమ్మి ఎన్నో సేవా కార్యక్రమాలను వారు కోట్లాదిమంది ప్రజలకు అందించడం జరిగిందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురాన్ని కలుపుతూ సుమారు 1999 సంవత్సరంలో మూడున్నర కోట్ల రూపాయల అంచనాలతో బ్రిడ్జిని రామకృష్ణ మఠం వారు సొంత నిధులతో నిర్మించడం జరిగిందని, నిర్మాణం పూర్తయిన అనంతరం మిగిలిన 25 లక్షల రూపాయలను అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిసి అందజేయడం వారిలో ఉన్న నిబద్ధతకు తార్కాణం అన్నారు. సేవ చేయడమే కాదు అది నిజమైన లబ్ధిదారులకు చేరుచున్నదా లేదా అనేది కూడా వారు స్వయంగా పరిశీలించి సహాయాన్ని అందించడమే వారి గొప్పతనం అన్నారు.
రాజమండ్రి రామకృష్ణ మఠం మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ మాట్లాడుతూ సేవ చేయడం ఎంత ముఖ్యమో అది నిజమైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం అన్నారు. నేడు లబ్ధిదారులు అందర్నీ కలిసి నేను మీతో మాట్లాడడం, మీ ఇబ్బందులను తెలుసుకోవడం, ఇంకా ఏదైనా చేయొచ్చా అనే ఆలోచనకు దోహదపడుతుందన్నారు. మీ జిల్లా కలెక్టర్ 300 మంది పేద మత్స్యకారులకు సహాయం చేయవలసిందిగా కోరడం జరిగిందని, కానీ మొదటి విడతగా 100 మంది పేద మత్స్యకారులను ఎంపిక చేసి వారికి పడవలను, వలలను అందించడానికి సమావేశం కావడం జరిగిందన్నారు. మరో వంద మందికి సహాయం చేయడానికి మా మిషన్ ప్రతినిధులతో చర్చించి వారి నిర్ణయం మేరకు త్వరలో ప్రకటించడం జరుగుతుందన్నారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు నగదు జమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, నేడు మన గ్రామంలో మనం “మత్స్యదాత సుఖీభవ” కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని వర్ణించారు. రామకృష్ణ మఠం మిషన్ ఆవిర్భావ పరిణామాన్ని వివరించారు. స్వామి వివేకానంద సంకల్పంతో నవీన భారతదేశ నిర్మాణానికి రామకృష్ణ మఠం మిషన్ ఏర్పాటు జరిగిందని, వారి ఆకాంక్షల మేరకు ఎంతోమంది పేద వర్గాలకు సహాయ సహకారాలను అందించడం జరిగిందన్నారు. సహాయం అంటే ఎవరి కాళ్ల మీద వారు నిలబడినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అనేది స్వామి వివేకానంద సందేశం అన్నారు. అప్పుడే నవీన భారత దేశ నిర్మాణానికి దోహదపడుతుందని ఆనాడే వారు వ్యాఖ్యానించారని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి నైపుణ్యాన్ని పెంచుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
చివరిగా ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను పేరుపేరునా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్టేజి మీదకి పిలువగా, రాజమండ్రి రామకృష్ణ మఠం మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ లబ్ధిదారు వివరాలను స్వయంగా సరిచూసి వారి జీవన విధానాన్ని, వేట వివరాలను తెలుసుకోవడం జరిగింది. స్వామి వివేకానంద బోధనలు అనుసరణీయంగా ఈ పరిశీలన ద్వారా నిజమైన లబ్ధిదారులకే సహాయం అందాలనే వారి సంకల్పాన్ని అభినందించాల్సిందే.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు మహిళా వసంతరావు, నరసాపురం ఆర్డీవో దాసిరాజు, మత్స్యకార సహాయ సంచాలకులు ఎల్ఎల్ఎన్ రాజు, నరసాపురం తహసిల్దార్ ఐతం సత్యనారాయణ, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.