రానున్న ఉగాది నాటికి జిల్లాలో 9,135 గృహాలను లబ్ధిదారులకు అప్పగించేందుకు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులను పూర్తి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం జిల్లాలో గృహ నిర్మాణాల ప్రగతిపై సంబంధిత శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అధికారులతో మండలాల వారీగా గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు వచ్చే ఉగాది నాటికి లబ్ధిదారులకు అందించేందుకు 9,135 గృహ నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు పూర్తి చేసిన గృహ నిర్మాణాల ప్రగతిపై మండలాలు, మున్సిపాలిటీలు వారిగా ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ఆప్షన్ -3 కాంట్రాక్టర్లు 5,075 ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. వీక్లీ టార్గెట్స్ నిర్ధారించుకొని పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గృహా నిర్మాణాల ప్రగతిపై ప్రతివారం సమీక్షించాలన్నారు. క్షేత్రస్థాయిలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గృహ నిర్మాణాలను మన జిల్లా రాష్ట్రస్థాయిలో 5 వ స్థానంలో ఉందని, మొదటి స్థానంలో ఉండే విధంగా అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
ఈ గూగుల్ మీట్ లో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, జిల్లా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అధికారి వై.దోసిరెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు, తదితరులు పాల్గొన్నారు.