Close

రాజముద్రతో ముద్రించిన తప్పులు లేని పట్టాదార్ పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీకి కృషి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 17/01/2026

రైతుల భూ హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ద్వారా కృషి చేస్తుంది

భూ రికార్డులు మార్పు చేసేందుకు వీలు లేకుండా ఆధునిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్

ప్రజల హక్కులను గౌరవిస్తూ వారికి భరోసా కల్పించడమే సుపరిపాలన లక్ష్యం

రాష్ట్ర ప్రభుత్వం సూచనలతో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన

పట్టాదారుపాస్ పుస్తకాలలో డేటా అంతా చాలా స్పష్టంగా, తప్పులు లేకుండా ఉండాలి .. తప్పులు ఉంటే సంబంధిత అధికారిని బాధ్యులను చేస్తూ చర్యలు ఉంటాయని హెచ్చరిక.

భూ రికార్డులను ఎవరూ మార్పు చేసేందుకు వీలులేకుండా ఆధునిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని దీనికి రైతుల సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు.

ఉండి మండలం పాములపర్రు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం రైతులతో ఏర్పాటుచేసిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రైతులతో ముఖాముఖి మాట్లాడి భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మీ భూమి.. మీ హక్కు కార్యక్రమంలో రాజముద్రతో ముద్రించిన తప్పులు లేని పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందించేందుకు, క్షేత్రస్థాయిలో మీ సమస్యలను తెలుసుకోవడానికి ఈరోజు అధికారులతో, రైతులతో సమావేశం కావడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రెవిన్యూ, భూ సమస్యలను నిర్దిష్టమైన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగిందన్నారు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా హక్కులను గౌరవిస్తూ భరోసా కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాలను అందించే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కదిలిందన్నారు. మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించే పాలనను ముఖ్యమంత్రి అందిస్తున్నారన్నారు. పేదవారు రూపాయి, రూపాయి దాచుకుని కొనుకున్న భూములపై వారికి పూర్తి హక్కులు కల్పించేదిశగా పట్టాదార్ పాస్ బుక్ తో రక్షణగా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందన్నారు. గతంలో నిర్వహించిన రీ సర్వేలో జరిగిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వం సరిచేసి రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులందరికీ అందజేస్తుందన్నారు. వాటిలో చిన్నపాటి సవరణలు, మార్పులు అవసరమైనచో సచివాలయములో డిజిటల్ అసిస్టెంట్ వద్ద దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పట్టాదారు పాస్ పుస్తకంలలోగల క్యూఆర్ కోడ్ లను వివరిస్తూ వాటిని స్కాన్ చేసినట్లయితే పట్టాదారు వివరములు, భూమి వివరాలు విస్తీర్ణం, స్కెచ్ మరియు రూట్ మ్యాప్, శాటిలైట్ ఇమేజి కూడా చూసుకొనవచ్చునని కలెక్టర్ రైతులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో రెండు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియను చేపట్టిందని, పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఉండి మండలం పాములపర్రు గ్రామం, కాళ్ల మండలం కొమ్మనపల్లి గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. పాములపర్రు గ్రామంలో 496 ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు ఏమైనా ఉంటే సరిచేసి ఫిబ్రవరి నెలలోపుగా పాస్ పుస్తకాలను అందజేయడం జరుగుతుందని రైతులు ఈ కార్యక్రమానికి సహకరించాలన్నారు. పట్టాదారుపాస్ పుస్తకాలలో డేటా అంతా చాలా స్పష్టంగా తప్పులు లేకుండా ఉండాలని తప్పులు ఉంటే సంబంధిత అధికారిని బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వీఆర్వో, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ సర్వేయర్, గ్రామ ప్రత్యేకాధికారి, సంబంధిత అధికారులు ప్రతి రైతు యొక్క వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదటే ప్రతిపాదనలను పంపాలని ఆదేశించారు. రైతులకు ఇది మంచి అవకాశం అని తప్పులు లేని పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందడం ద్వారా మీ హక్కుల పరిరక్షణతో పాటు, భరోసాగా జీవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రతి ఒక్క రైతు అభినందించాల్సిన విషయం అన్నారు.

తొలుత జిల్లా కలెక్టర్ పట్టాదారు పాసుపుస్తకాలు అందజేసే రైతులు ఖాతాలను స్వయంగా పరిశీలించి పేరుపేరునా రైతులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అలాగే అడంగల్ వన్ – బి పరిశీలించారు. జాబితాలోని వివరాలను, ఆన్లైన్లోనే వివరాలను సరిపోల్చి రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రభుత్వం అందించనున్న నూతన పట్టాదారు పాసుపుస్తకాలపై రైతుల మనోగతం వారి మాటల్లోనే…

కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందుకోవడం చాలా సంతోషంగా ఉంది..
.. వర్రె సుబ్బారావు, ఉండి మండలం, పాములపర్రు గ్రామం.

రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పొందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. నేను చాలా ఏళ్లుగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాను. భూ హక్కులపై రైతుల్లో ఉన్న ఆందోళనలను తొలగిస్తూ గతంలో కంటే ఉత్తమంగా ఆన్ లైన్ లో సులువుగా భూమి వివరాలు చూసుకునేందుకు వీలుగా కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.

ప్రభుత్వ రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు..
-కమ్మల ధనలక్ష్మి, ఉండి మండలం పాములపర్రు గ్రామం.

నేను కొన్నేళ్లుగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నాను. గతంలో రాజకీయ నాయకులు ఫోటోలు, తప్పులతో ఉన్న పుస్తకాలు కొన్ని గ్రామాల్లో అందించారు. దీనిపై రైతుగా ఎంతగానో ఆందోళన చెందాను. మా గ్రామంలో ఇంతవరకు ఒక పుస్తకం కూడా అందుకో లేదు. గతంలో తప్పులను సరిచేసి, రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో ఉన్న కొత్త పాస్ పుస్తకాలను అందుకోనున్నడం చాలా సంతోషంగా ఉంది. రైతుల భూములకు భద్రత కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది.

ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీవో కే.ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసిల్దార్ నాగార్జున, సర్పంచ్ కేసన శాంతకుమారి, వీఆర్వో డి.వెంకటేశ్వరరావు, ఇన్చార్జి పంచాయతీ సెక్రటరీ ఏ.శ్రీనివాసరావు, ఎంపీడీవో ఎం.వి.ఎస్ శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, మండల సర్వేయర్ రత్నవల్లి, రైతులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు