Close

రక్తదాన్ మహోత్సవ్ పేరిట రక్తదాన అవగాహన కార్యక్రమాలు మార్చి 15 నుండి ఏప్రిల్ 15 వరకు నిర్వహణ–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 06/03/2026

డిఎన్నార్ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు చదలవాడ నాగరాణి చేతుల మీదుగా “రక్తదాన్ మహోత్సవ్” రక్తదాన అవగాహన కార్యక్రమాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో “రక్తదాన్ మహోత్సవ్” పేరిట ఒక నెలరోజులపాటు రక్తదాన అవగాహన, రక్తదాన ప్రోత్సాహక కార్యక్రమం మార్చి 15 నుండి ఏప్రిల్ 15 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా స్వచ్ఛంద రక్తదాన ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంతో పాటు అర్హత కలిగిన దాతలను రక్తదానం చేయడానికి ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్కూల్ కమిటీలు, విద్యార్థులు, విద్యా వ్యవస్థకు చెందిన అన్ని భాగస్వాములను భాగస్వామ్యం చేయడం ద్వారా రక్తదానం ద్వారా ప్రాణాలను రక్షించే మానవతా సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో అధిక సంఖ్యలో సిబ్బంది ఉండటం వలన జిల్లాలో స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడంలో ఈ శాఖ ప్రముఖ పాత్ర పోషించగలదని తెలిపారు. అలాగే జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలలో రక్తదాన కార్యక్రమాలలో ముందంజలో నిలవాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ తానే ఒక స్వచ్ఛంద రక్తదాతగా స్ఫూర్తినిస్తూ, ఉపాధ్యాయులకు అన్ని భాగస్వాములను రక్తదానంపై చైతన్యం కల్పించాలని సూచించారు. అలాగే జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు అన్‌ఎయిడెడ్ పాఠశాలలు ఈ రక్తదాన ఉద్యమంలో పాల్గొంటాయని తెలిపారు.

రెడ్ క్రాస్ పశ్చిమ గోదావరి చైర్మన్ డా.ఎం.ఎస్.వి.ఎస్.భద్రి రాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నాయకత్వంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా జిల్లాలో నిర్వహిస్తున్న వివిధ మానవతా కార్యక్రమాలను వివరించారు. ఈ రక్తదాన్ మహోత్సవ్ కార్యక్రమంలో ఉపాధ్యాయ సమాజం చురుకుగా పాల్గొని రక్తదానానికి ముందుకు రావాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, సమగ్ర శిక్ష ఏపీసి పి.శ్యాంసుందర్, సహాయ సంచాలకులు సత్యనారాయణ, విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.