యువ ఓటర్లు మంచి నిర్ణయాత్మకమైన ఆలోచనతో సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనది.
18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
16 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకుని, ఎన్నికల సమయంలో తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో అత్యధిక ఓటర్ల నమోదుకు తీసుకున్న చర్యలకు గాను జిల్లాకు ఉత్తమ ఎన్నికల విధానాల అవార్డు లభించిందని, నేడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేతులమీదుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అందుకోవడం జరిగిందని తెలిపారు. 1950 లో భారత ఎన్నికల సంఘం స్థాపించిన రోజును గుర్తు చేసుకుంటూ కేంద్రం ప్రతి ఏటా వేడుకలు నిర్వహిస్తోందని అన్నారు. నేను ఒక్కడినే ఓటు వేయకపోతే ఏమవుతుంది అని కాకుండా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించు కోవాలన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ బూత్ లెవెల్ స్థాయి అధికారుల నుండి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్థాయి వరకు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో విద్యార్థులకు వివరించారు. మై ఇండియా మై ఓటు… నేను ఓటు వేస్తాను అనే మెసేజ్ ను విద్యార్థులు ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ మధ్యమాల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ,సంబంధిత సమాచారాన్ని విద్యార్థులు పుస్తకాల ద్వారా చదివి అవగాహన చేసుకోవాలన్నారు. దీని ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాధాన్య తెలుస్తుందన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి విద్యార్థిని, విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్ ఓటర్లు, ప్రజలతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ ఓటర్లను, ట్రాన్స్ జెండర్స్ ఓటర్లను జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి దుస్సాలువ, మేమెంటో, పూలదండలతో ఘనంగా సత్కరించారు.
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ పాఠశాలల, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలలో గెలుపొందిన విజేతలకు మెమొంటో, ప్రశంసాపత్రాలు అందజేశారు. అదేవిధంగా జిల్లాలో అధిక ఓటర్ల నమోదుకు ఉత్తమ సేవలు అందించిన ఎలక్షన్ డిప్యూటీ తహసిల్దార్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, బిఎల్వోలు, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్, ఎలక్షన్ టెక్నికల్ అసిస్టెంట్ లకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జాతీయ ఓటర్ల దినోత్సవం అవార్డులను అందజేశారు.
జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా ఆదిత్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల, చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
తొలుత విష్ణు ఇంజనీరింగ్ కళాశాల మెయిన్ గేట్ నుండి కళాశాల ఆడిటోరియం వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీకి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, ఆర్డీవో కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసిల్దార్ రావి రాంబాబు, భీమవరం మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, వివిధ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు

