Close

“మొంథా తుపాను” ప్రభావాన్ని జిల్లా యంత్రాంగం ముందస్తు సన్నద్ధ, సమన్వయంగా పనిచేయడం ద్వారా జిల్లాలో తీవ్ర నష్టాన్ని నివారించ గలిగాము

Publish Date : 31/10/2025

మరో రెండు రోజుల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాలను యధాస్థితికి తీసుకువచ్చేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో నిమగ్నమై ఉన్నారు.

…. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

వీరవాసరం మండలం కొణితవాడ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, పీఏసీ చైర్మన్ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు
తుఫాన్ బాధితులకు నిత్యవసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. బియ్యం 25 కేజీలు, కంది పప్పు 1 కేజీ, పంచదార 1 కేజీ, వంటనూనె 1 లీటరు, బంగాళాదుంపలు 1 కేజీ ఉల్లిపాయలు 1 కేజీ మొత్తం ఆరు రకాలు తో కూడిన కిట్లను 55 మంది బాధితులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, పీఏసీ చైర్మన్ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు చేతులు మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ “మొంథా” తుపాన్ వల్ల ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు మన ముఖ్య మంత్రి, ఉప ముఖ్య మంత్రి నిరంతరం సమీక్షల నిర్వహించి అన్ని జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. దీని దృష్ట్యా జిల్లా అధికారులు ముందస్తు సన్నద్ధత ద్వారా సమర్థవంతంగా సమన్వయంతో పనిచేయడం వల్ల జిల్లాలో ఎక్కడ ప్రాణం నష్టం జరగలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితులు యోగక్షేమాలు తెలుసుకొని, పునరావాస కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించారన్నారు. జిల్లాలో 600 చెట్లు, 200 ఎలక్ట్రిక్ స్తంభాలు నేలకొరిగాయని, రాత్రికి రాత్రే వాటిని తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 25 వేల ఎకరాలలో పంట నీటి మునిగిందని, ఎన్యుమరేషన్ పూర్తయినాక పంట నష్టాల నివేదికను ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు.

పిఎసి చైర్మన్, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ తుఫాను ప్రభావిత ప్రాంతాలలోని పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందిన బాధితులకు బియ్యం, నిత్యవసర వస్తువులు అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నేడు కొనితివాడ గ్రామంలో 55 మంది తుఫాను బాధిత కుటుంబాలకు బియ్యం, ఐదు రకాల నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి గరిష్టంగా రూ.3 వేలు ఆర్థిక సహాయం కూడా అందించడం జరుగుతుందన్నారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల తుఫాన్ నష్టాన్ని తగ్గించుకోగలిగామన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసిల్దార్ ఏ.వి రామాంజనేయులు, ఎండిఓ హైమావతి, మాజీ రాజ్యసభ సభ్యులు తోట సీత మహాలక్ష్మి, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ ఘoటా త్రిమూర్తులు, ఎంపీపీ వి.దుర్గాభవాని, జడ్పిటిసి గుండా జయ ప్రకాష్, గ్రామ సర్పంచ్ బిసెట్టి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.