మే 2న ప్రధానమంత్రి పాల్గొనే అమరావతి రాజధాని పునః నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మే 2న గౌరవ ప్రధాని నరేంద్రమోదీ వస్తున్న క్రమంలో ప్రధాని సభకు వెళ్లేందు ప్రజలకు చేయాల్సిన ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించి రవాణా, తాగు నీరు సదుపాయం, ట్రాఫిక్ సమస్యలు లేకుండా సభ వేదికకు చేరుకోవడం వంటి సన్నాహాక ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ సభకు జిల్లా నుండి 150 బస్సులలో 7,500 మంది తరలివెళ్లేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి వెళ్ళే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీరు, వైద్య సదుపాయము, ఆహారము అందించడంతోపాటు రాకపోకలకు ఎలాంటి సమస్య లేకుండా ఏర్పాటులు చేయాలన్నారు. సకాలంలో సభకు హాజరయ్యేలా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు. ఉదయం అల్పాహారం, స్నాక్స్, మధ్యాహ్నం భోజనం, త్రాగునీరు ప్రతి బస్సుకు ఏర్పాటు చేయాలన్నారు. బస్సులను సిద్ధం చేయాలని జిల్లా రవాణా అధికారిని ఆదేశించారు. ప్రతి బస్సుకు మెడికల్ సిబ్బందిని కేటాయించాలని డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ కు సూచించారు. ప్రధాని పర్యటనకు ప్రజలను తీసుకువెళ్ళి తిరిగి తీసుకొచ్చేవరకు మానిటరింగ్ చేసుకునేలా సిబ్బందిని కేటాయించాలని డిఆర్ఓకు సూచించారు. ప్రధానమంత్రి పర్యటనలో భాగంగా జిల్లా ప్రజలను పంపేందుకు విధులను కేటాయించిన ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రవాణా అధికారి ఉమామహేశ్వరరావు, డి ఆర్ డి ఏ పిడి ఎమ్మెస్ ఎస్ వేణుగోపాల్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ టి.శివరామ ప్రసాద్, గ్రామ వార్డు సచివాలయాల అధికారి వై.దోసి రెడ్డి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ భాను నాయక్, డ్వామా పిడి కే సిహెచ్ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.