ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ద్వారా నూరు శాతం నిరోధించవచ్చని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
నవంబర్ 7 జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పరిష్కరించుకొని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, పట్టణ ప్రముఖులు, విద్యార్థులుతో కలిసి భీమవరం పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుండి ప్రకాశం చౌక మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ముఖ్య అతిథులుగా పాల్గొని ర్యాలీని జండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఆరోగ్యకరమైన జీవనశైలి – కాన్సర్ రహిత జీవితానికి రహదారి!, ముందస్తు పరీక్ష- కాన్సర్ నుండి రక్ష! “క్యాన్సర్ పై విజయం – స్క్రీనింగ్ తో సాధ్యం’, ఆహారమే ఔషధం, వంటగదియే ఔషధశాల!, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి – మందుల అవసరం తగ్గించుకోండి! స్లొగన్స్ తో కొనసాగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అనేకమంది జీవితాలను ప్రభావితం చేస్తుందని అన్నారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే వ్యాధి నుండి కోలుకునే అవకాశం గణనీయంగా పెరుగుతుందని అన్నారు. ప్రతి ఏటా నవంబర్ 7వ తేదీన జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ సిబ్బంది గ్రామ, గ్రామాన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ వినాశకరమైన వ్యాధి వ్యతిరేక పోరాటంలో ముందస్తుగా గుర్తించడం వలన నివారణ చేయవచ్చు అన్నారు. ఈ వ్యాధి పట్ల స్త్రీ, పురుషులు తేడాలేకుండా ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ పరీక్షలు ముందస్తుగా నిర్వహించుకోవాలన్నారు. ఈ రోజు క్యాన్సర్ నివారణ, ముందస్తుగా గుర్తించడం మరియు చికిత్స గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు. క్యాన్సర్ గురించి అవగాహన పెంచడం, ముందుగా గుర్తించడం, నివారణ చర్యలను ప్రోత్సహించడం, చికిత్సకు మద్దతు ఇవ్వడం దీని లక్ష్యం అన్నారు. సమాజంలో జీవన ప్రమాణాలు పెరగడం, జీవన శైలి లో మార్పులు రావడంతో బి.పి., షుగర్ లతో పాటు ఈ రోజుల్లో క్యాన్సర్ కేసులు కూడా గణనీయంగా నమోదు అవుతున్నాయన్నారు. ప్రతి సంవత్సరం చాలా ఎక్కువ సంఖ్యలో కొత్త క్యాన్సర్ కేసులు గుర్తింపబడుతున్నాయన్నారు. వీటిలో చాలా కేసులు ఆలస్యంగా గుర్తించబడటంతో రేడియో, కీమో చికిత్సలు తీసుకోవలసిన అవసరం రావడం, తిరిగి నయంచేయలేని స్థితి లో వుండటంతో అధిక మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితులలో పేషెంట్ తో పాటు కుటుంబాలు అధిక ఆర్థిక భారం, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయన్నారు. దీనికి ఒకే ఒక పరిష్కారంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవడం మరియు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం, బి.పి., షుగర్ పరీక్షలు ఎంత ముఖ్యమని భావనలో వున్నారో, అదే విధంగా క్యాన్సర్ పై కూడా అవగాహన కలిగివుండాలన్నారు. క్యాన్సర్ అంటే భయపడాల్సిన పని లేదని, ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయగల వ్యాది ఇది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 18 సంవత్సరాల పైబడిన ప్రతి పౌరునికి ఉచితంగా నోటి, రొమ్ము మరియు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ సదుపాయం కల్పించిందన్నారు. ఇది కొందరికే వస్తుంది, నాకు రాదు అనే అపోహలు వద్దన్నారు. ప్రజలందరూ ముందుకు వచ్చి ఈ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు మొహమాటం, బిడియం తో వెనుకంజ వేయకుండా ఆరోగ్య సిబ్బందికి సహకరించాలన్నారు. ఈ రోజు ‘జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం’ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహనా ర్యాలికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, డిఎంహెచ్వో డాక్టర్ బి. గీతా బాయి, భీమవరం మున్సిపల్ కమిషనర్ కే.రామచంద్రారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఏ.రాంబాబు, డీఈవో ఇ. నారాయణ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు. మంగపతి రావు, జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకనలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ అధికారి అరుణ కుమారి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పుష్ప రాణి, తహశీల్దార్ రావి రాంబాబు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.