• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

మానవతా సేవలు అభినందనీయం-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 13/08/2025

ప్రస్తుత తరుణంలో మానవీయతపై ఆలోచన చేసి ఆచరణలో అమలు చేస్తున్న మానవతా సంస్థ సేవలు అభినందినీయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

బుధవారం భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో మానవతా సంస్థ రూ.12 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటుచేసిన శాంతి రథాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా సంబంధాలు తగ్గుతున్న ఈ రోజుల్లో అనాధ శవాలు, పేదల భౌతికకాయాలు అంతిమ యాత్రగా స్మశాన వాటికకు ఉచితంగా తీసుకెళ్లేందుకు ఆలోచన చేసి వాహనాన్ని కూడా ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. ఆధునిక యుగంలో మానవ సంబంధాలు కొరవడి చనిపోయిన వారిని వాహనాలపై తరలించడం చూస్తూనే ఉన్నామని, వాహన ఖర్చులు పేద, మధ్యతరగతి వర్గాలకు భారం కాకుండా ఆపద సమయంలో సంతోషంగా అంతిమ కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు తోడ్పాటును అందించేందుకు ముందుకు రావడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం అన్నారు. అనాధ శవాలను ఆ సంస్థ స్వయంగా వాహనంపై తీసుకువెళ్లి దహన సంస్కారాలు చేయడంతో పాటు, పేద వర్గాల వారికి ఉచితంగా రవాణాను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

మానవతా సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతి రాజు మాట్లాడుతూ అనాధ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించడంతోపాటు, పేదలకు ఉచితంగా శాంతి రథాన్ని పంపడం జరుగుతుందన్నారు. శాంతిరథం అవసరమైనవారు మానవతా సంస్థ చైర్మన్ 94943 38086, వైస్ చైర్మన్ 94901 04401, ఎగ్జిక్యూటివ్ మెంబర్ 92474 62667 సెల్ నంబర్ల నందు సంప్రదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, ఎల్ డి ఎం.నాగేంద్ర ప్రసాద్, మానవత సంస్థ భీమవరం శాఖ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతి రాజు, అధ్యక్షుడు చింతలపాటి రామకృష్ణ రాజు, కో చైర్మన్ కారుమూరి నరసింహమూర్తి, కోశాధికారి గ్రంధి కుమార్ వెంకటేశ్వర ప్రసాద్, భూపతి సత్యనారాయణ రాజు, పెనుమత్స రామ్మోహన వర్మ, అల్లు శ్రీనివాస్,
మానవతా సేవ సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.