Close

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం, సమాజం బాగుంటుంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 09/11/2025

సఖి సురక్ష శిబిరాలను .. పట్టణ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలి..

మెప్మా ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలు 35 ఏళ్లు నిండిన వారికి ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్య శిబిరాలు నిర్వహణ..

శనివారం భీమవరం మున్సిపాలిటీ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ సహకారం, ఈ-వైద్య ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన ‘సఖి సురక్ష’ వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం కుటుంబ శ్రేయస్సు అని, స్వయం సహాయక సంఘాల మహిళల శారీరక, మానసిక, పోషకాహార ఆరోగ్యాన్ని కాపాడి, వారి ఆర్థిక సుస్థిరత సాధించడమే సఖి సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ‘సఖి సురక్ష’ కార్యక్రమం కింద జిల్లాలో మెప్మా పరిధిలోని పట్టణ మహిళల లక్ష్యంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తాడేపల్లిగూడెంలోని కౌన్సిల్ భవనం మెప్మా విభాగంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు. ఈరోజు 8వ తేదీ భీమవరం లోని పురపాలక కార్యాలయం ఆవరణలో, రెండో పట్టణంలోని 37వ వార్డు మున్సిపల్ కమ్యూనిటీ హాలు పురపాలక పాఠశాలలో, తణుకు రైల్వే స్టేషన్ దగ్గర రోటరీ క్లబ్ లో నిర్వహించడం జరుగుచున్నదని తెలిపారు. 9న పాలకొల్లులోని మెప్మా విభాగం 22వ వార్డులోని కొత్తపేట అర్బన్ కమ్యూనిటీ హాలులో, 11న నరసాపురంలోని మెప్మా భవనంలో వైద్య శిబిరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు. ఈ వైద్య శిబిరాలు ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు, రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదం, పోషకాహార లోపాలు, రక్తహీనత, విటమిన్ లోపం, ప్రోటీన్ లోపం, రొమ్ము, గర్భాశయం, నోటి కాన్సర్ ముందస్తు గుర్తింపు,డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, కౌన్సిలింగ్ అవసరాలకు సూచనలు, అవసరమైతే ల్యాబ్లో పరీక్షలు చేస్తారని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఆరోగ్యకార్డు కూడా ఇస్తారని, రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా, ఏడాదికి నాలుగు సార్లు టెలీ కన్సల్టేషన్ సేవలు, వైద్య సేవలకు ఆయా ఆసుపత్రులకు సిఫార్సు చేయడం జరుగుతుంది అన్నారు.

భీమవరం శాసనసభ్యులు, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడి వారి ఆర్థిక సుస్థిరత సాధించడమే” సఖి సురక్ష” కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. నేడు భీమవరం పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఈ వైద్య శిబిరం ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. పట్టణ ప్రాంతాల్లోని 35 ఏళ్లు పైబడిన స్వయం సహాయక గ్రూపు మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ఈ వైద్య శిబిరాలలో మహిళలు అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు చేయించుకొని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, మెప్మా పీడీ హెబ్సిబా, తహసిల్దార్ రావి రాంబాబు, కలెక్టరేట్ పరిపాలనాధికారి, ఈ – వైద్య సంస్థ ప్రముఖ వైద్యులు సురేంద్ర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు