“మన స్వాతంత్ర స్ఫూర్తికి మూలం వందేమాతరం, మన ఐక్యతకు ప్రతీక వందేమాతరం.”–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు, “వందే మాతరం” రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం భీమవరం పట్టణములోని అంబేద్కర్ కూడలి నందు వందేమాతర గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొని దేశభక్తి గీతం “వందేమాతరం”ను ఏకస్వరంగా ఆలపించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వందేమాతరం అనేది దేశభక్తి యొక్క నినాదం మాత్రమే కాదని, అది మన మనసుల్లో దేశమంటే ఏమిటో గుర్తుచేసే శక్తి అన్నారు. వందేమాతరం అనేది కేవలం ఒక గీతం కాదని , అది భారతీయుల మనసుల్లో దేశభక్తిని మేల్కొలిపిన ఆత్మీయ నినాదంగా అభివర్ణించారు. బంకిమ్ చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్లాది భారతీయులలో ఆత్మవిశ్వాసాన్ని, త్యాగస్ఫూర్తిని నింపిందన్నారు. వందేమాతరం అనేది మన దేశం పట్ల ఉన్న గౌరవం, ప్రేమ, సేవాస్ఫూర్తికి ప్రతీక అన్నారు. ఈ రోజు విద్యార్థులు, అధికారులు, పోలీసులు, ప్రజలు ఒకే గళంలో ఆలపించడం ద్వారా మన దేశ ఏకతను, ఐకమత్యాన్ని ప్రతిబింబించిందన్నారు. ప్రతి భారతీయుడు ఈ గీతం యొక్క స్పూర్తిని అర్థం చేసుకుని దేశ సేవలో భాగస్వామిగా మారాలన్నారు. వందేమాతరం పాడినప్పుడు మన హృదయం గర్వంతో నిండాలి, ఎందుకంటే అది మన భారతీయతకు ప్రతీక అన్నారు. బంకిం చంద్ర ఛటర్జీ వంటి గొప్ప వ్యక్తి మనకు ఇచ్చిన స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ, దేశ ఐక్యత కోసం మనమందరం కలిసి నడవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
భీమవరం శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమకారుల్లో పోరాట స్ఫూర్తిని రగిలించిన గీతం వందేమాతరం అన్నారు. వందేమాతరం నవంబర్ 7, 2025 నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, మనమంతా కలిసి వందేమాతరం పూర్తి గేయాన్ని పాడుకుని దేశభక్తిని గర్వంగా చాటుకుందామన్నారు.
జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ జాతీయ సమైక్యత భావంతో దేశ ప్రజల్లో శాంతి పురిగొల్పేలా బకిం చంద్ర ఛటర్జీ వందేమాతరం గీతాన్ని రచించారని, వందేమాతరం, జనగణమన గీతాలు భారతీయతను చాటుకుంటాయన్నారు
ఈ కార్యక్రమంలో ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీఈవో ఇ. నారాయణ, డిఎంహెచ్వో డాక్టర్ బి. గీతా బాయి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు. మంగపతి రావు, జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకనలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ అధికారి అరుణ కుమారి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పుష్ప రాణి, తహశీల్దార్ రావి రాంబాబు, టిడిపి నాయకులు మెంటే పార్ధసారధి, కోళ్ల నాగేశ్వరరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ చెనమల్ల చంద్రశేఖర్, ఎఎంసి వైస్ చైర్మన్ బండి రమేష్, స్థానిక నాయకులు వబిలిశెట్టి రామకృష్ణ, యారంశెట్టి శివకృష్ణ, ఇందుకూరి రామలింగరాజు, గనిరెడ్డి త్రినాథ్, ఇందుకూరి సుబ్రహ్మణ్య రాజు, కారుమూరి సత్యనారాయణ మూర్తి, పీఎస్ఎం బాలికొన్నాత పాఠశాల విద్యార్థులు, కూటమి నాయకులు, పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.