మన రాష్ట్ర రైతును ఆదుకునేందుకు ప్రజలందరూ కొద్ది రోజులపాటు కర్నూలు ఉల్లినే వినియోగించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విజ్ఞప్తి చేశారు.

సోమవారం తాడేపల్లిగూడెం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఉల్లి హోల్ సేల్ వర్తకులతో, మున్సిపల్ కార్యాలయంలో వివిధ విద్య సంస్థల ప్రతినిధులతో కర్నూలు ఉల్లి వినియోగంపై సమీక్షించారు. తొలుత ఉల్లి హోల్ సేల్ వర్తకులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ కర్నూలు ప్రాంతంలో అధిక వర్షాలు కారణంగా ఉల్లి పంట దెబ్బతినటం మనందరికీ తెలిసిందే అన్నారు. మన రాష్ట్ర రైతును ఆదుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని, ఎన్నో ఏళ్లగా కొనసాగుతున్న ఉల్లి వ్యాపారంలో కర్నూలు ప్రాంత రైతుల నుండి ఎంతో కొంత లాభాలను తీసుకున్నామని, నేడు వారికి మనం అండగా నిలవాల్సిన సమయం వచ్చింది అన్నారు. కొంతకాలం మహారాష్ట్ర ఉల్లి దిగుమతులను తగ్గించుకొని మన కర్నూలు ఉల్లిని వినియోగం లోనికి తీసుకురావాలన్నారు. కిలో ఒక్కింటికి రూ.12/- చొప్పున కొనుగోలు చేసి ఆ ప్రాంత రైతులను ఆదుకోవాలని హోల్సేల్ వర్తకులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. దీనికి హోల్సేల్ వర్తకులు అంగీకరించడంతో జిల్లా కలెక్టర్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. తాడేపల్లిగూడెం వాసులు ఎన్నో సందర్భాలలో పలు విధాలుగా సహాయాలు చేయడం నేను చూశానని అదే స్ఫూర్తితో కర్నూల్ రైతును కూడా ఆదుకోవాలని అన్నారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయంలో వివిధ కళాశాలలు, పాఠశాలల ప్రతినిధులతో సమావేశమై విజయవాడ వరదలు సమయంలో మీ వంతు సహాయంగా ముందుకు వచ్చి ఆనాడు వరద బాధితులకు ఆపన్న హస్తం అందించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేడు మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లా రైతులకు ఉల్లి పంట అకాల నష్టాలను తెచ్చిందని, మనమంతా కలిసికట్టుగా వారికి చేయూతనందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీ హాస్టల్స్ లో ప్రతిరోజు వంటలకు వినియోగించే ఉల్లిని కర్నూలు ఉల్లినే వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. కొద్దిరోజుల పాటు మహారాష్ట్ర ఉల్లిని పక్కనపెట్టి కర్నూలు ఉల్లిని కొనుగోలు చేసి వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహారాష్ట్ర ఉల్లి కంటే కర్నూలు ఉల్లి తక్కువ ధరకే అందుబాటులో ఉందని, దీనివలన మీకు డబ్బు కూడా చాలా ఆదా అవుతుందని తెలిపారు. మహారాష్ట్ర ఉల్లి మార్కెట్లో 25 నుండి 35 రూపాయల వరకు ఉందన్నారు. కొద్ది రోజులు పరిస్థితులు చక్కబడే వరకు సహకారం అందించాలన్నారు. తాడేపల్లి పట్టణంలోని రిలయన్స్, డి మార్ట్ వంటి మెగా మార్ట్ లు ద్వారా కూడా కర్నూలు ఉల్లిని అమ్మేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్, తహాసిల్దార్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కతీబ్ కౌసర్ భానో, మార్కెటింగ్ శాఖ ఆర్జెడి కే.శ్రీనివాసరావు, మార్కెటింగ్ ఎడి కె.సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు, తహసిల్దార్ ఎం.సునీల్ కుమార్, ఉల్లి హోల్ సేల్ వర్తకులు, నిట్, హార్టికల్చర్ యూనివర్సిటీ, శశి, భారతీయ విద్యా భవన్, వాసవి, తదితర కళాశాలలు, పాఠశాలల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.