మనిషి సృష్టించిన ప్లాస్టిక్ మనిషినే తినేసేంతగా విస్తరించిందని, దీని కారణంగా పెద్ద ఎత్తున క్యాన్సర్ బారిన పడుతున్నారని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

శనివారం పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్” కార్యక్రమంలో భాగంగా “సోర్స్ – రిసోర్స్” అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత జిల్లా కలెక్టర్ స్థానిక ప్రజలు, వివిధ శాఖల సిబ్బందితో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మనిషి సృష్టించిన ప్లాస్టిక్ మనిషినే తినేస్తుందని, దీని కారణంగా పెద్ద ఎత్తున క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. నీటిలో, భూమిలో, గాలిలో విపరీతంగా కలిసిపోయి వనరులను కలుషితం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సర్వే ప్రకారం వివిధ పదార్థాల ద్వారా ప్రతి వ్యక్తి ప్లాస్టిక్ ను ప్రతిరోజు స్వల్పంగా తినడం జరుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధం ఒక్కరితో ముడిపడినది కాదని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే నియంత్రణ సాధ్యం అన్నారు. దీనిలో భాగంగా తొలి ప్రయత్నంలో జిల్లా కలెక్టరేట్ నందు ప్లాస్టిక్ వస్తువులు బదులుగా స్టీల్ వస్తువులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. అలానే ప్రతి ప్రభుత్వ శాఖలో ప్లాస్టిక్ బదులు ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించడం జరుగుచున్నదన్నారు. పెక్సీల స్థానంలో గుడ్డ క్లాత్ పై పెయింటింగ్ వేస్తే పర్యావరణానికి ఎటువంటి హాని కలగదని, దీనిని కొనసాగించాలన్నారు. ఇంటి వద్దనే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని, ఇలా చేయడం వలన పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడుగలిగిన వారం అవుతాం అన్నారు. కూరగాయలు, పళ్ళు, సరుకులు కొనడానికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా చేతి సంచిని తీసుకుని వెళ్లడం అలవాటుగా మార్చుకోవాలన్నారు. ప్లాస్టిక్ నిషేధం ఒక ఉద్యమంలా చేపట్టాలన్నారు. చేయి చేయి కలిస్తేనే ఇటువంటి కార్యక్రమాల్లో మంచి ఫలితాలను సాధించగలమని, అందరూ కలిసికట్టుగా ప్లాస్టిక్ నిర్మూలనకు ముందడుగు వేయాలన్నారు.
అనంతరం ప్లాస్టిక్ నిషేధిద్దాం అనే కాన్సెప్ట్ తో తయారు చేసిన సెల్ఫీ పాయింట్ నందు జిల్లా కలెక్టర్ ఫోటో దిగారు. స్థానికులకు జ్యూట్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు.
అనంతరం అదే గ్రామంలో నిర్వహిస్తున్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి తొలుత మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కంపోస్ట్ ను తయారు చేస్తున్న వివరాలను దశల వారీగా అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బి.అరుణ శ్రీ, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి నాగేశ్వరరావు, ఎంపీపీ చిత్తూరు కనకమహాలక్ష్మి, తాహసిల్దార్ వై.కృష్ణ కిషోర్, ఎంపీడీవో ఎన్ ఉమామహేశ్వరరావు, పంచాయతీరాజ్ టెక్నికల్ కోఆర్డినేటర్ ఎన్.ఎడ్వర్డ్, స్థానిక పెద్దలు పి.కృష్ణంరాజు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.