భీమవరం వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి.
భీమవరం పురపాలక సంఘ పరిధిలోని తాడేరు రోడ్డులో ఉన్న భీమవరం వృద్ధుల ఆశ్రమాన్ని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం రాత్రి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులతో జాయింట్ కలెక్టర్ ఆత్మీయంగా మాట్లాడి వారి ఆరోగ్యం, భోజనం, వసతి సౌకర్యాలు గురించి వివరాలు అడిగి తెలుసుకొని వృద్ధులకు దానిమ్మకాయలు, కమలాలు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. వృద్ధులకు అందుతున్న వైద్య సేవలు, పారిశుధ్యం, భద్రత తదితర ఏర్పాట్ల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వృద్ధాశ్రమంలో 50 మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారని వారిలో 35 మందికి వృద్ధాప్య పింఛన్లు అందుతున్నాయని, 15 మందికి ఆధార్ కార్డు లేకపోవడం వల్ల రావడం లేదని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఆధార్ కార్డు లేని వారందరికీ ఆధార్ సీడింగ్ పూర్తి చేసి సత్వరమే వారికి ఆధార్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహసిల్దార్, విఆర్ఓలను ఆదేశించారు. అదేవిధంగా వృద్ధులకు వైద్య సేవలు అందించేందుకు 104 వాహనం వారంలో రెండుసార్లు వృద్ధాశ్రమానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వృద్ధాశ్రమంలో 365 రోజులు వృద్ధులకు నాణ్యమైన పోషకాహారం, పండ్లు అందిస్తూ వారిని ఆదరిస్తున్న నిర్వాహకులను జాయింట్ కలెక్టర్ అభినందించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి 50 వేల రూపాయలు విలువచేసే వాషింగ్ మిషన్ ను వృద్ధుల ఆశ్రమానికి బహుకరించారు.
ఈ సందర్భంలో డిప్యూటీ తహసిల్దార్ సురేష్, మోహన్ రావు, రవికుమార్, రాజు, తదితరులు ఉన్నారు.