భీమవరం పాత బస్టాండ్ నూతన కాంప్లెక్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరిగిందని, త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు తెలిపారు.

బుధవారం భీమవరం పాత బస్టాండ్ ప్రాంగణంలో శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు భీమవరం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాత బస్టాండ్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ భీమవరం అభివృద్ధికి శరవేగంగా చర్యలు చేపట్టడం జరిగిందని దీనిలో భాగంగా 1962లో ఏర్పాటుచేసిన పాత బస్టాండ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొత్త బస్టాండ్ నుండి ప్రారంభమయ్యే దూర ప్రాంతాల బస్సులు అన్నీ కూడా పాత బస్టాండ్ కు వచ్చి వెళ్లేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. పాత బస్టాండ్ శిథిలావస్థకు చేరుకోవడంతో దాతలు సిహెచ్ రామ్ బద్రిరాజు రూ.30 లక్షలు ఖర్చు చేసే నూతన బస్టాండ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందుకు రావడం జరిగిందని, ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తున్నానన్నారు. ప్రజలు, దాతలు, అధికారులు సహాయ సహకారాలతో భీమవరం పట్నం నందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు భీమవరం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 60 సంవత్సరాల పైబడిన పాత బస్టాండ్ ను మళ్ళీ పునర్ నిర్మించుకోవడానికి ముందుకు వచ్చిన దాతలు సిహెచ్. రామ్ భద్రరాజు అభినందనీయులన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ను జూన్ 28 నాటికి పూర్తి చేయుటకు లక్ష్యంగా పెట్టుకుని పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దాత కుమారుడు ఫణి కుమార్ వర్మ, భీమవరం మున్సిపల్ కమిషనర్ కే.రామచంద్రారెడ్డి, డిపో మేనేజర్ పి ఎన్ వి ఎం సత్యనారాయణమూర్తి, టిడిపి నాయకులు కె.నాగేశ్వరరావు, లైన్స్ ఇంటర్నేషనల్ సిహెచ్ కృష్ణంరాజు, ప్రముఖ సంఘ సేవకులు కంతేటి వెంకటరాజు, తదితరులు పాల్గొన్నారు.