భీమవరం పట్టణంలో చెత్త నిర్మూలనకు పక్క ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పట్టణ పారిశుద్ధ్యనికి తీసుకోవలసిన చర్యలపై భీమవరం ఆర్డీవో మరియు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్యం మెరుగుదలకు ఎన్ని చర్యలు చేపట్టిన నామ్ కే వాస్తే అనే చందంగా ఉందని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఇచ్చిన వాకీటాకీలను ఎందుకు వినియోగించడం లేదని గట్టిగా ప్రశ్నించారు. రేపటినుండి వాకి టాకీలు కచ్చితంగా వినియోగించాలని ఆదేశించారు. శానిటేషన్ సిబ్బంది తప్పనిసరిగా వారికి ఇచ్చిన ఐడెంటిటీ కార్డు, యూనిఫామ్, గ్లౌజులు, రైన్ కోట్స్ వినియోగించాలన్నారు. యూనిఫామ్ లేకుండా విధులు నిర్వహిస్తే మున్సిపల్ సిబ్బంది ప్రజలకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. పట్టణం మొత్తం వీధి వీధిన ఫాగింగ్ చేయడానికి తేదీలు వారిగా చార్ట్ ప్రిపేర్ చేయాలని సహాయ కమిషనర్‌ను ఆదేశించారు. అలాగే వీధులలో డ్రై వెస్ట్ తొలగింపుకు వారానికి రెండుసార్లు చార్ట్ ను రూపొందించాలన్నారు. ప్రజలు చెత్త నిర్మూలనకు ఏమి చేయకూడదు, ఏమి చేయాలి అనే వివరాలతో కరపత్రాలను రూపొందించి పంపిణీ చేయాలని తెలిపారు. ప్రజలు, వాణిజ్య సముదాయాల యజమానులు, తోపుడుబండ్ల వ్యాపారులకు చెత్త నిర్వహణపై పూర్తి అవగాహన కల్పించాలని, అప్పుడే చెత్తను నియంత్రించగలమని స్పష్టం చేశారు. ఒకటికి, రెండుసార్లు అవగాహన కల్పించిన అనంతరం కచ్చితంగా పెనాల్టీలను వేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి కంటికి కనిపించే అంత స్పష్టంగా పారిశుద్ధ్య నిర్వహణ ఉండాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో భీమవరం ఆర్డీవో మరియు మున్సిపల్ కమిషనర్ కే.ప్రవీణ్ కుమార్ రెడ్డి, సహాయ కమిషనర్ ఏ.రాంబాబు, మున్సిపల్ ఇంజనీర్ పి.త్రినాధ రావు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.