భవ్య భీమవరం పేరిట చేపట్టిన వివిధ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు

శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భవ్య భీమవరం ప్రాజెక్టుల పురోగతిపై భీమవరం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి మరియు ఆర్డీవో, మున్సిపల్ అధికారులతో సమావేశమై సమీక్షించారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం చుట్టుపక్కల ఆధ్యాత్మికతతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు కృషి చేయాలన్నారు. నిబంధనలను అతిక్రమించి ఉన్న ఆక్రమణదారులకు వెంటనే నోటీసులు జారీ చేసి, తొలగింపుకు చర్యలు తీసుకోవాలన్నారు. సుందర పట్టణంగా రూపుదిద్దేందుకు చేస్తున్న కృషిలో ఆక్రమణలు అడ్డంకి కాకూడదన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరించడానికి అవకాశం లేకుండా ఉందని, ఇటువంటి పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలన్నారు. ప్రతి ఒక్క భక్తుడు ఇబ్బందులేని విధంగా దర్శనం చేసుకోవడంతో పాటు, ఒక ఆధ్యాత్మిక ప్రాంతానికి వచ్చిన అనుభూతి కలగాలని సూచించారు. భీమవరంలో స్విమ్మింగ్ పూల్ అవసరం ఎంతైనా ఉన్నదని, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలకు స్విమ్మింగ్ పోటీలకు కూడా ఉపయోగంగా ఉంటుందన్నారు. ఇప్పటికే చేపట్టిన పాత బస్టాండ్ మోడ్రన్ బస్ స్టాప్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కాస్మో క్లబ్ దగ్గరలో వంశీకృష్ణ నగర్, ఏ ఎస్ ఆర్ నగర్, ఆదర్శనగర్, ఆదిత్య కళావేదిక, మారుతీ నగర్ పార్కుల పనుల పురోగతి, ఆర్ యు బి పక్కన ఖాళీ స్థలంలో చేపట్టిన పనులపై సమీక్షించారు. ఎడ్వర్డ్ ట్యాంక్ చిల్డ్రన్ బోట్ అరేంజ్మెంట్స్ కు టెండర్స్ పిలవడం జరిగిందని తెలిపారు. మోక్షదాం, గునుపూడి స్మశాన వాటికల పనులపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డిఓ మరియు భీమవరం మున్సిపాలిటీ స్పెషలిటీ ఆఫీసర్ కే ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కే రామచంద్ర రెడ్డి, సహాయ కమిషనర్ ఏ.రాంబాబు, జిల్లా టూరిజం అధికారి ఏ వి అప్పారావు, మున్సిపల్ ఇంజనీర్ పీ.త్రినాధ రావు, తదితరులు పాల్గొన్నారు.