బాల్యంలో చదువుకోవడమే బాధ్యతగా మెలగాలి, ఆడపిల్లలు ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు
శుక్రవారం నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం నక్కావారి పేటలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తరగతి గదులను స్వయంగా పరిశీలించి విద్యార్థులతో కొద్ది సమయం ముచ్చటించారు. బాగా చదువుతున్నారా, సబ్జెక్టు టీచర్లు ఉన్నారా, పదవ తరగతి అనంతరం ఏ కోర్సు చేయాలనుకుంటున్నారు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్యంలో చదువుకోవటం ఒక్కటే మీకు ఉన్న బాధ్యత అని, బాగా చదువుకోవాలన్నారు. ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండాలని హితువు పలికారు. చదువుకునే వయస్సులో సెల్ ఫోన్లు చూసుకుంటూ సోషల్ మీడియాకు ఆకర్షితులయితే భవిష్యత్తు లక్ష్యాలను సాధించలేరని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదువుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే ఆడపిల్లలు తన కాళ్ళపై స్వశక్తితో నిలబడగలరని మంచి భవిష్యత్తును పొందగలరని సూచించారు. తల్లిదండ్రులకు మీపై ఎంతో ప్రేమ ఉండి మిమ్మల్ని దూరంగా వదిలి ఉండలేని పరిస్థితి ఉన్నాను మీకు మంచి భవిష్యత్తును కలుగజేయాలనే లక్ష్యంతో చదివించడానికి పంపిస్తున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలను సాధించి ప్రయోజకుల అవ్వాల్సిన బాధ్యత మీపై ఉందని ఉద్ఘాటించారు. పదో తరగతి అనంతరం డిప్లమా కోర్సులు అభ్యసించడం వలన మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ఐటిఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ కోర్సులు వంటిని వాటిని అభ్యసించి ఉద్యోగాల్లో స్థిరపడాలని సూచించారు. చిన్నారులు తయారుచేసిన హ్యాండీక్రాఫ్టును జిల్లా కలెక్టర్కు బహుమతిగా అందజేశారు.
ఈ సందర్భంలో ఆర్డీవో దాసిరాజు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏ.వి సూరిబాబు, బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్.కె శైలజ, తహాసిల్దార్ ఎన్ ఎస్ ఎస్ వి ప్రసాద్, తదితరులు ఉన్నారు.