ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మెరుగైన మౌలిక వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, విద్యలో రాణించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

గురువారం అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత బల్లిపాడు పీఎం శ్రీ జిల్లా పరిషత్ హై స్కూల్ లో పిఎం శ్రీ నిధులు రూ.15.58 లక్షల వ్యయంతో నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్ ను, రూ.5 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన వాలీబాల్, షటిల్, కబాడీ, లాంగ్ జంప్ కోర్టులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు కల్పించే దిశగా ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నదన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో లేని విధంగా కెమిస్ట్రీ ల్యాబ్ ను ఈ పాఠశాల నందు ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషించదగిన విషయం అన్నారు. ప్రైవేటు పాఠశాలలో ప్లే గ్రౌండ్స్ కొరత కూడా ఉందని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మానసికంగా, ఆరోగ్యంగా ఎదిగేందుకు ఆట స్థలాల నిర్మాణాలను కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు మంచి భవిష్యత్తును పొందాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉంటారనేది గుర్తించుకోవాలన్నారు. విద్యార్థులలో పోషక విలువలు తగ్గకుండా ఉండేలా మంచి మధ్యాహ్న భోజనం, స్కూల్ యూనిఫామ్, ఆర్వో వాటర్, తదితర ఏర్పాట్లను కూడా చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆట స్థలాన్ని ప్రారంభించిన అనంతరం సరదాగా కొంత సమయం కలెక్టర్, శాసనసభ్యులు రెండు టీములుగా ఏర్పడి వాలీబాల్ ను ఆడి ఉత్సాహపరిచారు.
అనంతరం వేణుగోపాల స్వామి దేవస్థానం దగ్గరలో చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగను జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు స్వయంగా అందజేశారు.
తదుపరి ఎన్ ఆర్ జి ఎస్ నిధులు రూ.1.85 లక్షల వ్యయంతో నిర్మించిన మినీ గోకులం షెడ్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించి, రైతును కొన్ని విషయాలు తెలుసుకున్నారు. అక్కడే ఉన్న నాటు కోడి పిల్లల హేచరీస్ ను సందర్శించి, పిల్లలు తయారీ, పెంపకం తదితర విషయాలపై యజమానిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమాలలో సమగ్ర శిక్ష ఏపీసి శ్యాంసుందర్, డిఆర్డిఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, హెడ్మాస్టర్ బాలసుబ్రమణ్యం, ఈవోపీఆర్డి ఎం శ్రీనివాస్, డి ఎల్ డి వో ప్రభాకర్, ఎంపీడీవో పీ. శామ్యూల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.