ప్రభుత్వమే స్వయంగా మెనూను రూపొందించి విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారాన్ని అందిస్తుంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు అందిస్తుంది..
వసతి గృహాల్లో విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరు కావాలి…
ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది..
విద్యార్థులకు స్వయంగా రాత్రి భోజనాన్ని వడ్డించిన కలెక్టర్.
ఆకివీడు సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ క్రమం తప్పకుండా వసతి గృహాలకు హాజరు అవ్వాలని, మీ అన్నదమ్ములు కూడా వసతి గృహానికి వచ్చేలా చూడాలన్నారు. మీకు మంచి చదువు, ఆహారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని తెలిపారు. వసతి గృహంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. దోమలు రాకుండా కిటికీలకు మెష్ లు వేయించాలని ఆదేశించారు. హాజరు శాతం తక్కువగా ఉండటంపై కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇంత మంచి వసతి గృహంలో కేవలం 26 మంది విద్యార్థులు మాత్రమే ఉండటంతో అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ రక్షణ దళం బృందానికి వసతి గృహంలో చేరికలు పెరిగేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, మీ ద్వారా మా దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఫిర్యాదులు మాత్రమే కాదని, వసతి గృహాల సంక్షేమం, విద్యార్థులు చేరికలకు కూడా బాధ్యతగా తీసుకోవాలని రక్షణ దళం బృందానికి వివరించారు. విద్యార్థులకు వండిన ఆహార పదార్థాలను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులకు భోజనాన్ని కొసరి కొసరి వడ్డించారు. మంచి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని, తద్వారా చదువుపై దృష్టి పెట్టగలుగుతారని, అన్ని పదార్థాలను వదలకుండా తినాలని ఒక అమ్మలా చెప్పారు.
ఈ సందర్భంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్.వి. అరుణ కుమారి, వసతి గృహ సంక్షేమ అధికారి జి.ఎన్.వి ఫణి కుమార్, ఆకివీడు నగర పంచాయతీ కమిషనర్, తహసిల్దార్ ఫరూక్, స్థానిక కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.