Close

ప్రధాన సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వెబ్ ఎక్స్ ద్వారా ఆర్డివోలు, తహసిల్దార్లతో నేరుగా మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు.

Publish Date : 19/01/2026

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.

ఫిర్యాదుల పరిష్కారం అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలి.

నేడు పి జి ఆర్ ఎస్ లో 139 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్ లో 54 దరఖాస్తులు స్వీకరణ.

…జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

జిల్లా కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పిడి డా కె సి హెచ్ అప్పారావు, జిల్లా కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎన్.వెంకటేశ్వరరావు, జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి పిటిషన్లు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అధికారులు లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. కొన్ని ప్రధాన సమస్యలపై జిల్లా కలెక్టర్ నేరుగా ఆర్డీవోలు, తహసిల్దార్లతో వెబ్ఎక్స్ ద్వారా మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం పీజిఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కార ప్రగతిపై మండల వారీగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. నిర్ణీత గడువులోగా ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేడు భూ సంబంధిత సమస్యలు, కొత్తగా వికలాంగ, వితంతు పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణం, ఇల్లు మంజూరు, ఆరోగ్య అంశాలకు సంబంధించిన వివిధ సమస్యలపై ప్రజల నుండి పలు ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.

భీమవరం కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్

తొలుత జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రెవెన్యూ క్లినిక్ కౌంటర్లను సందర్శించి, భూ సమస్యలపై అందిన ఫిర్యాదులను పరిశీలించారు. దరఖాస్తులను ఏ విధంగా పరిశీలిస్తున్నారు, వారికి ఏ విధంగా సమాధానం తెలియజేస్తున్నారు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి తదితర వివరాలను అక్కడ విధుల్లో ఉన్న డిప్యూటీ తహసిల్దార్లను, రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు అన్ని రికార్డులను సిద్ధంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.

దివ్యాంగులు ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా కలెక్టర్

వివిధ ప్రాంతాల నుండి జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న దివ్యాంగులు వద్దకు జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి ఆప్యాయంగా ప్రేమతో పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. దివ్యాంగులలో కొందరు కొత్తగా పెన్షన్ మంజూరు కావడంలేదని, ప్రస్తుతం పొందుతున్న పెన్షన్ రూ.6 వేల నుండి రూ.15 వేలకు పెంచుతూ మంజూరు చేయాలని, దివ్యాంగత్వం లెక్కింపుకు కొన్ని పరీక్షలు జిల్లాలో చేయడం లేదని ఏలూరు జిల్లాలో కూడా ప్రస్తుతం చేయడం లేదని, విజయవాడ, గుంటూరు జిల్లాకు వెళ్తే పరీక్ష చేయడం లేదని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ కొత్త పింఛన్లు, పింఛన్లు పెంపు ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాత పరిష్కరించడం జరుగుతుందన్నారు. దివ్యాంగత్వం లెక్కింపు పరీక్షలకు జిల్లాలో ఉన్న వారిని గుర్తించి స్లాట్ తీసుకుని, ఒక వాహనం ద్వారా వారిని వేరే జిల్లాకు పంపి పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని డి సి హెచ్ ఎస్, డి ఆర్ డి ఎ పి డి లను ఆదేశించారు.

ఈ రోజు అందిన అర్జీలలో కొన్ని పిర్యాదులు ఈ విధంగా ఉన్నాయి.

@ అత్తిలి మండలం ఉనికిలి గ్రామం నుండి కె .భాగ్యలక్ష్మి, కె.రామలింగేశ్వరరావు అర్జీ సమర్పిస్తూ రీ సర్వే నెం200-1 నందు 1-04 సెంట్లు భూమికి గాను వెబ్ ల్యాండ్ యందు 84 సెంట్లు భూమి మాత్రమే నమోదయిందని, కొలతలు కొలిపించి 1-04 సెంట్లు భూమికి హద్దులు చూపించాలని కోరారు.

@ కాళ్ల మండలం పెదమిరం గ్రామంలో ఆర్ఎస్ నెంబర్ 471లో రెండు ఎకరముల పొలము ఉందని, రీసర్వే సమయంలో మాకు ఎటువంటి సమాచారం లేకుండా జాయింట్ ఎల్ పి ఎం కేటాయించారని, వేరుచేసి సింగిల్ ఎల్ పి ఎం కేటాయించాలని మంతెన శ్రీనివాసరాజు అర్జీ సమర్పించారు.

@ తణుకు మండలం, వేల్పూరు గ్రామం నుండి గుడి ఈశ్వరమ్మ 53 సంవత్సరములు తనకు శాశ్వత వికలాంగత్వం ఉండటం వలన ఎటువంటి పని చేసుకోలేక పోతున్నానని, జీవనోపాధి లేక అనారోగ్యంతో బాధపడుతున్నానని, ప్రభుత్వం వికలాంగులు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.

@ భీమవరం మున్సిపాలిటీ 23 వ వార్డుకు చెందిన శివకవి సాంబమూర్తి తన భార్య శివ కవికృష్ణకుమారి 58 సంవత్సరాలు దీర్ఘకాలికంగా అంగవైకల్యంతో బాధపడుతున్నానని, గతంలో పెన్షన్ వచ్చేదని కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినదని పెన్షన్ నిలుపుదల చేశారన్నారు. ఆదాయం ఏమీ లేదని,పరిశీలన చేసి పెన్షన్ వచ్చేలా చేయాలని కోరారు.

@ ఆచంట మండలం శేషమ్మ చెరువు గ్రామం నుండి మన్నే సుభద్ర సమర్పిస్తూ, మా సరిహద్దు భూమిలో ప్రభుత్వం అనుమతులు లేకుండా రొయ్యల చెరువు సాగు చేస్తున్నారని దాని కారణంగా మా పంట నష్టపోతున్నాము చర్యలు తీసుకుని పంట నష్టము జరగకుండా చూడాలని కోరారు.

@ వీరవాసరం మండలం పంజా వేమవరం గ్రామానికి చెందిన బోడపాటి సతీష్ అర్జీ సమర్పిస్తూ,గ్రామంలో పక్క డ్రైన్ లేకపోవడం వలన మురుగునీరు పారుదల లేక ప్రజలు ఇబ్బందులు గురి అవుతున్నామని పక్కా డ్రైవ్ నిర్మించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వృద్ధుల సంక్షేమ అప్పీల్లేట్ ట్రిబ్యునల్ మెంబెర్ మేళం దుర్గాప్రసాద్, వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.