ప్రతి ఫైలు ఉన్నతాధికారులకు ఈ-ఆఫీస్ ద్వారానే పంపేందుకు అధికారులు, ఉద్యోగులు సన్నద్ధం కావాలి–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
ప్రభుత్వ కార్యాలయాల నుండి ఇకపై ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ-ఆఫీస్ ద్వారానే నిర్వహించాలి.
జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మంగళవారం ఈ-ఆఫీస్ నిర్వహణపై రెవిన్యూ అధికారులకు, ఉద్యోగులకు గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలలో ఇకపై ప్రతి ఫైలు ఈ ఆఫీస్ ద్వారానే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలని ప్రభుత్వం ఆదేశించింది అన్నారు. ఈ మేరకు నేడు రెవిన్యూ డివిజన్ అధికారులు, తహసిల్దార్లు, డిప్యూటీ తహసిల్దారులు, రెవెన్యూ సిబ్బందికి ఈ ఆఫీస్ నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేడు రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి ఈ ఆఫీస్ ద్వారా ఫైల్స్ ఏ విధంగా నిర్వహించాలి అనే దానిపై కల్పించిన అవగాహనను ఉద్యోగులు మరోసారి పునఃచరణ చేసుకుని ఇకనుండి ప్రతి ఫైలును ఈ ఆఫీస్ ద్వారానే సంబంధిత కార్యాలయాలకు పంపే విధంగా సన్నద్ధతకావాలని ఆదేశించారు. ఈ వారాంతానికి ఫైల్స్ ఈ ఆఫీస్ ద్వారా పంపేందుకు మెళుకువలు తెలుసుకోవాలన్నారు. ఫైళ్లను నిర్ణీత గడువులో పరిష్కరించడంతోపాటు ప్రభుత్వ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు కావాలని అధికారులను ఆదేశించారు. ఈ విధానంతో కార్యాలయం పనితీరు మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందుతాయని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. రెవిన్యూ డివిజనల్ అధికారులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ -ఆఫీస్ ద్వారా వచ్చిన ఫైల్స్ ను పరిశీలించి సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల పరిపాలన అధికారులు ఈ- ఆఫీస్ నిర్వహణపై పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ ఆఫీస్ ద్వారా ఒక ఫైలు టపాల్ స్థాయి నుండి డిజిటల్ సైన్ అయ్యేంతవరకు మధ్యలో ఉన్న ప్రతి మూమెంట్ ను ఎన్ఐసి టెక్నికల్ అసోసియేట్ అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు.
ఈ- ఆఫీస్ విధానంలో “డిజిటల్ కీ” (Key) వినియోగంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎన్ఐసి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ప్రస్తుతం ఉన్న “డిజిటల్ కీ”లు వినియోగం లేకపోతే వెంటనే ఆక్టివేట్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ గూగుల్ మీట్ లో జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, రెవిన్యూ డివిజనల్ అధికారులు కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, ఖతీబ్ కౌసర్ భానో, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శేఖర్, డిటి యం.సన్యాసిరావు, జిల్లాలోని తహసిల్దార్లు, డీటీలు, మినిస్ట్రియల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.