ప్రతి కౌలు రైతు పంట సాగుదారు హక్కు పత్రం తప్పనిసరిగా పొందాలని, తద్వారా పంట రుణాలు పొందడానికి సాధ్యమవుతుంది తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

శనివారం పెంటపాడు మండలం పత్తిపాడు గ్రామ సచివాలయం వద్ద పంట సాగుదారు హక్కు పత్రం షరతులపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పంట సాగు చేసే రైతులు తప్పనిసరిగా పంట సాగుదారు హక్కు పత్రం పొందాలన్నారు. తద్వారా పంటరుణము, పంట భీమా, ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టము పొందడానికి వీలవుతుందని స్పష్టం చేశారు. ప్రతి కౌలు రైతుకు పంట సాగుదారు హక్కు చట్టము 2019 లోబడి కొన్ని షరతులు వర్తిస్తాయన్నారు. ఈ చట్టము క్రింద ఎవరేని న్యాయనిర్ణయ అధికారి ముందు భూ యజమానికి వ్యతిరేకముగా భూమి పై హక్కును క్లైమ్ చేసుకోవడానికి లేదా సమర్ధిచుకోవడానికి సాక్ష్యంగా ఈ కార్డును ఉపయోగించకూడదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పంట సాగు హక్కు చట్టము 2019 సెక్షన్ 5(b) ప్రకారము ఈ ఋణ అర్హత పత్రము సాగుదారునకు కాల వ్యవధిలో పండిన పంట పై మాత్రమే హక్కు కల్పించడం జరిగిందన్నారు. అంతేకాని భూమి పై ఏవిధమైన హక్కు ఉండదన్నారు. భూమి పై సర్వ హక్కులు భూ యజమానికి మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పంట సాగు హక్కు చట్టము 2019 సెక్షన్ 5(c) ప్రకారము ఋణ అర్హత కార్డుదారు పంటరుణము, పంటభీమా, ఇన్పుట్ సబ్సిడీ మరియు పంట నష్టము మాత్రమే పొందగలరని తెలిపారు. భూమిపై ఎటువంటి స్వాధీనహక్కు గాని, కౌలు మరియు ఇతర హక్కులుగాని పొందలేరన్నారు. ఈ కార్డును ఉపయోగించి రెవిన్యూ అధికారి పట్టాదారుని యొక్క భూమిపై హక్కుని ఎట్టి పరిస్థితుల్లో బదలాయించకూడదన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు తదితర ఆర్థికసంస్థలు ఈ కార్డుదారునకు ఇచ్చిన పంటరుణమును తిరిగి వసులు చేసుకొనుటలో ఫలసాయముపై మాత్రమే హక్కును కలిగిఉంటారని, భూమిపై హక్కును కలిగి ఉంరన్నారు. గ్రామ సచివాలయము భూ యజమానికి, సాగు రైతుకు మధ్య ఈ చట్టము అమలులో అనుసంధానకర్తగా వ్యవహరిస్తుందని తెలిపారు. భూ యజమాని లేదా రైతు అందుబాటులో లేనిచో భూ యజమాని లేదా రైతు యొక్క అంగీకార పత్రము ఎలక్ట్రానిక్ పద్దతి (ఈ మెయిల్ లేదా వీడియో కాన్ఫరెన్స్, మొదలైనవి) ద్వారా ఇవ్వవచ్చును. అలా ఇచ్చిన పత్రములను నిర్దేశిత అధికారి ఏ ఆర్ ఓ ధృవీకరించి భద్రపరుస్తారని తెలిపారు.
ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం ఆర్డిఓ కతీబ్ కౌసర్ భానో, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, ఏడిఏ పి.మురళీకృష్ణ, ఎం ఏ ఓ కె.పార్థసారథి, పెంటపాడు ఇంచార్జ్ తహసిల్దార్ బి.సీతారత్నం, తదితరులు పాల్గొన్నారు.