Close

ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే సామాజికంగా, ఆర్థికంగా వారి యొక్క కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 04/02/2026

కాళ్ల మండలం పెద్దఅమిరం సచివాలయం నందు నిర్వహిస్తున్న ఉల్లాస్ అక్షరాంధ్ర అక్షరాస్యతా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. విద్యను అభ్యసిస్తున్న మహిళలతో సమావేశమై రోజు వస్తున్నారా, ఇప్పటివరకు ఎంతవరకు నేర్చుకున్నారు, చదువుకోవడం ఆనందంగా ఉందా, మీకు చదువు వస్తుందని ధైర్యం కదిలిందా ఇలా పలు ప్రశ్నలను అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. వారు నేర్చుకున్నవి స్వయంగా వారితో చదివించారు. వారు రాసినవి సరిదిద్దారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉల్లాస్ అక్షరాంధ్ర అక్షరాస్యతా కార్యక్రమాన్ని చదువు రాని వారి కోసం ఏర్పాటు చేసిందని, వారి దిన చర్యలు ముగించుకున్న తర్వాత రాత్రి వేళల్లో చదువుకోడానికి అవకాశం కల్పించిందన్నారు. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాలను కూడా అభ్యాసకులకు అందించడం జరుగుతుందని, దీని ద్వారా రాయడం, రాయడం చాలా సులువుగా వస్తాయన్నారు. ఒక్క వారం రోజుల్లోనే కొన్ని మాటలు చదవడం, రాయడం కూడా వస్తుందని, అందించిన టెస్ట్ బుక్స్ పూర్తయ్యే వరకు నేర్చుకుంటే సొంతంగా చదవడం, వ్రాయడం, ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా మీ ద్వారా చదివించడానికి వీలవుతుందన్నారు. సంతకం నేర్చిన మహిళ ఆర్థికంగా ప్రగతి సాధిస్తుందని, కుటుంబ వ్యవహారాలను కూడా చక్కదిద్దుకోగలుగుతారని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాలోని డ్వాక్రా, మెప్మా గ్రూపు సభ్యుల, గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అక్షరాస్యతలు కావాలన్నారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం వారికే చెందింది కాదని చదువురాని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్ పాఠాలు బోధించడానికి స్థానిక పంచాయతీ కార్యదర్శిని టీవీ ఏర్పాటు చేయమని ఆదేశించారు. అందరూ క్రమం తప్పకుండా వచ్చి చదువు నేర్చుకోవాలని అభ్యాసకులకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వయోజన విద్యా జిల్లా నోడల్ అధికారి కే.వి.వి సత్యనారాయణ, డిఆర్డిఏ ఏపిఎం శ్రీనివాస్, సీసీలు, డ్వామా సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ పాల్గొన్నారు.

1.11