Close

ప్రతి ఒక్కరు ఏదో ఒక క్రీడలో తన ప్రతిభను చాటాలి..

Publish Date : 15/11/2025

రాష్ట్రస్థాయిలో స్కూల్ గేమ్స్ అండర్ 14, 17 ఆర్చరీ పోటీల్లో బంగారు, వెండి పథకాలు సాధించిన పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థులు ….

… అభినందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి.

శనివారం భీమవరం కలెక్టరేట్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డిని స్కూల్ గేమ్స్ అండర్ 14, 17 విభాగాల్లో ఆర్చరీ పోటీల నందు రాష్ట్రస్థాయిలో బంగారు, వెండి పథకాలను సాధించిన క్రీడాకారులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆర్చరీలో పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందిస్తూ, రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు, క్రీడలకు కూడా కొంత సమయాన్ని కేటాయించాలని అన్నారు. క్రీడలలో రాణిస్తే మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చు అని, చదువులో కూడా చురుగ్గా ఉంటారని తెలిపారు. క్రీడల్లో రాణించినవారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి వారికి ఇష్టమైన ఏదో ఒక ఆటను ఎంచుకొని గెలుపు లక్ష్యంగా సాధన చేయాలని అన్నారు. స్కూల్ గేమ్స్ అండర్ 17 విభాగంలో ఎం.సుహాస్, ఎం.సూర్య హంసిని బంగారు పథకాలను సాధించారు. వి.స్ఫూర్తి, హంసిని వెండి పథకాలను సాధించడం జరిగింది. సబ్ జూనియర్ విభాగంలో సుహాస్ బంగారు పథకాన్ని, కనిష్క్ వెండి పథకాన్ని సాధించడం జరిగింది. స్కూల్ గేమ్స్ లో పథకాలు సాధించిన వారు వారణాసి లో జరిగే 69వ నేషనల్ గేమ్స్ లో పాల్గొననున్నారు. అలాగే సబ్ జూనియర్స్ విభాగంలో పథకాలు సాధించిన వారు అరుణాచల్ ప్రదేశ్ లో ఈనెల 23 నుండి 30 వరకు జరిగే నేషనల్స్ లో పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి నూతక్కి మోహన్ దాస్, డీఈవో ఇ.నారాయణ, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కోచ్ జయలక్ష్మి, ఈ.సాహితీ, కమల కిషోర్, క్రీడాకారుల తల్లిదండ్రులు, తదితరులు ఉన్నారు.