Close

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుండి స్వీకరించిన అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత శాఖల అధికారులును ఆదేశించారు

Publish Date : 21/04/2025

సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి పంచాయితీ, రెవెన్యూ, భూ సమస్యలు, సర్వే, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, డి ఆర్ డి ఎ, ఐసిడిఎస్, వయోవృద్ధుల సంక్షేమం, తదితర శాఖలకు సంబంధించిన 237 అర్జీలను స్వీకరించారు. అందిన ప్రతి ఒక్క అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని నిర్ణీత గడువులోపుగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో పలు ప్రాంతాల నుండి అందిన ఫిర్యాదుదారుల నుండి స్వీకరించిన వాటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి.

1) తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామానికి చెందిన పెరుమళ్ళ సత్యనారాయణ దంపతులు అర్జీని సమర్పిస్తూ మేము మా కుమారుడికి ఎకరం పొలమును రాసి ఇచ్చినామని, అతడు హైదరాబాదులో ఉంటూ మమ్మలని చూడటం లేదని తిరిగి మా ఆస్తి మాకు అప్పగించేలా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.

2)ఆకివీడు మండలం సిద్దాపురం, చిన్నమిల్లి, గ్రామాలకు చెందిన రెవిన్యూ పరిధిలోగల జిరాయితి పట్టా భూములు ఫిషర్మెన్ సొసైటీ భూములలో కేంద్ర ప్రభుత్వం పరిష్కారంలో ఎన్ బి డబ్ల్యు ఎల్ ఆమోదము మేరకు మా భూములు మాకు ఇప్పించాలని ఆ గ్రామాలకు చెందిన కోనాల ఏసు పాదం, కర్ర మోషే, ఉచ్చుల చెల్లయ్య తదితరులు కోరారు.

3) నా భూమి ఆక్రమణకు గురి అయినది సర్వే చేయించి హద్దులు చూపాలని పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామానికి చెందిన బొక్క చంద్రావతి కోరారు.

4) ఇరగవరం మండలం తూర్పు విప్పర్రు గ్రామంలో ఇరిగేషన్ కెనాల్ గట్టును ఆక్రమించుకుని ట్రాక్టర్లు వెళ్లకుండా, వ్యవసాయ పనులకు ఆటంకం కల్పిస్తున్నారు. చర్యలు తీసుకోవాలని రైతులు ఏ.సూర్యనారాయణ,
ఏ.లక్ష్మీనరసింహరావు కోరారు.

5) పెంటపాడు మండలం పరిమెళ గ్రామంలో ప్రజలు వెళ్లే రహదారికి అక్రమముగా మురుగు తూములను పెట్టి ఇబ్బందులు కలిగించుచున్నారు. చర్యలు తీసుకోవాలని పెంటపాడు మండలం పరిమెళ్ళ గ్రామానికి చెందిన చవ్వాకుల వెంకటలక్ష్మి కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, వయోవృద్ధుల ఆప్పిలేట్ ట్రిబునల్ సభ్యులు మేళం దుర్గాప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.