పెనుగొండ శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా అమ్మవారిని దర్శించున్న సీఎం చంద్రబాబు

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నా
ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పణ అనంతరం గురుపీఠం నిర్మాణానికి శంకుస్థాపన
పెనుగొండ శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఈ ఆలయానికి 2,600 ఏళ్ల చరిత్ర ఉందని, అమ్మవారిని వేడుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకమన్నారు. పశ్చిమ గోదావరిజిల్లా పెనుగొండలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని సీఎం చంద్రబాబు శుక్రవారం దర్శించుకున్నారు. ఆత్మార్పణ దినం సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన కలియుగ పార్వతీదేవిగా అమ్మవారిని భక్తులు కొలుస్తారు. అహింస, ఆత్మ త్యాగం, శాంతి, ధర్మ నిరతికి ప్రతిరూపం అమ్మవారు. దేశవ్యాప్తంగా ఆర్య వైశ్యులతో పాటు అన్ని వర్గాల ప్రజలు అమ్మవారిని కొలుస్తారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
దేవుని వరం వాసవీ మాత దర్శనం
భగవంతుని ఆశీస్సులతో పెనుగొండ పాలకులైన కుసుమ శ్రేష్టి, కుసుమాంబ దంపతులకు శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి జన్మించింది. గుణవంతురాలైన వాసవిమాత సమాజం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించేవారు. రాజమహేంద్రవరాన్ని పాలించిన విష్ణువర్ధనుడు అనే రాజు వాసవీ అమ్మవారిని పెళ్లిచేసుకోవాలని భావించి ఆమె తల్లిదండ్రులను సంప్రదించారు. అమ్మవారు సహా 102 మంది గోత్రికులు ఈ పెళ్లికి నిరాకరించారు. ఆగ్రహించిన విష్ణువర్ధనుడు దుర్భాషలాడాడు. తన వల్ల హింస జరగకూడదని, శాంతిని కాపాడాలనే సదుద్ధేశంతో అమ్మవారు సహా 102 మంది గోత్రికులు ఆత్మార్పణ చేశారు. అనంతరం, మహిషాసుర మర్ధిని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవి దేవి దర్శనమిచ్చారు. అప్పటినుంచి ఆర్యవైశ్యులు అమ్మను దేవతగా కొలుస్తున్నారు. దేశవ్యాప్తంగా వాసవిమాతకు ఆలయాలు ఉన్నాయి. ఆలయంలో 90 అడుగుల అమ్మవారి విగ్రహం ప్రతిష్టించారు. ఏడు అంతస్తుల గాలిగోపురం కట్టారు. ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకొచ్చిన దాతలను నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు.
అమ్మవారి ఆశీస్సులతో అందిరికీ మంచి జరగాలి
వైశ్యులు నీతి, నిజాయితీలతో వ్యాపారం చేస్తారు. సంపాదించిన డబ్బులో కొంత ప్రజాసేవకు వినియోగిస్తారు. ఒకప్పుడు చిరు వ్యాపారాలకే పరిమితమైన వైశ్యులు ఇప్పుడు పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులతో అందరికీ మంచి జరుగుతుంది. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించాము. 161 ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాము. ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండాలన్నదే నా ధ్యేయం. స్వర్ణాంధ్ర విజన్ -2047 లక్ష్య సాధనలో ఆర్య వైశ్యులు కూడా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.