Close

పుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ స్థాపనలో ఎస్ హెచ్ జి మహిళలు అవగాహన కలిగి యూనిట్ల స్థాపన ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 06/12/2025

భీమవరం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం నందు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అండ్ డిఆర్డిఏ సంయుక్తంగా నిర్వహించిన “ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్దీకరణ పథకం” ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఇప్పటికే స్థాపించిన యూనిట్లకు ఆధునిక సాంకేతికతను జోడించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రాజెక్టు వ్యయంలో 90% రుణ సౌకర్యాన్ని 35 శాతం సబ్సిడీతో అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే వ్యాపారాభివృద్ధికి ఆలంబించాల్సిన ఆధునిక పద్ధతులు, పరికరాల వాడకం తదితర విషయాలను, నిపుణులచే సూచనలు, మెరుగైన శిక్షణను అందజేయడం జరుగుతుందన్నారు. యూనిట్లు స్థాపన, ఉత్పత్తి కన్నా మార్కెటింగ్ చాలా ప్రధానమైనదని, బ్రాండింగ్ కూడా అవసరం అన్నారు. పెద్ద బ్రాండ్లకు దీటుగా, పోటీగా నిలవడానికి కావలసిన బ్రాండింగ్ & మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తూ పోటీని తట్టుకోవడానికి కావలసిన మెలుకువలు, అవలంబించాల్సిన పద్ధతులపై శిక్షణ కూడా అందించడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాల పైబడిన వారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపనకు అర్హులన్నారు. లబ్ధిదారులు సంబంధిత రిసోర్స్ పర్సన్ గానీ, జిల్లా అధికారిని గాని సంప్రదించి ఆన్లైన్ నందు నమోదు చేసుకోవాలని, లబ్ధిదారుడు బ్యాంక్ ను స్వయంగా ఎంపిక చేసుకునే సౌకర్యం ఉందన్నారు. పూర్తి సమాచారం కోసం www pmfmeap.org లో పరిశీలించవచ్చని తెలిపారు. రానున్న మూడు నెలల్లో జిల్లాలోని ప్రతి మండలంలో కనీసం 10 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ఎస్ హెచ్ జి లు ముందుకు రావాలన్నారు. లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిఆర్డిఏ అధికారులకు సూచించారు. ఎంపిక అనంతరం ఫార్వర్డ్, బ్యాక్ వర్డ్, మార్కెటింగ్, లింకేజ్, బ్రాండింగ్, ప్యాకింగ్ లో శిక్షణను అందించడం జరుగుతుందన్నారు. ఫిష్ ఐస్ బాక్స్ లు, ఎఫ్ బి ఓ ప్రొక్యూర్మెంట్, మిషనరీ, డ్రై ఫిష్ లబ్ధిదారులను గుర్తించాలని ఫిషరీస్ అధికారికి తెలిపారు. అలాగే క్యాటిల్ ఫీడ్ యూనిట్ల స్థాపనకు ప్రోత్సహించాలని పశుసంవర్ధక శాఖ అధికారికి తెలిపారు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని ఉద్యానవన సాగులో ముందుకు తీసుకెళ్లాలని ఉద్యానవన అధికారికి సూచించడం జరిగింది.

ఈ సమావేశంలో డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ సాయి శ్రీనివాస్, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ ఎ.నాగేంద్ర ప్రసాద్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు. మంగపతి రావు, హార్టికల్చర్ అధికారి శ్రీలక్ష్మి, డి ఆర్ డి ఏ ఏపిడి కుసుమ కుమారి, హార్టికల్చర్ డిఆర్పిలు, డిఆర్డిఏ సిబ్బంది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ హెచ్ జి లు, తదితరులు పాల్గొన్నారు.