పిల్లలు, విద్యార్థులు నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకొని రక్తహీనతకు దూరం కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు .

మంగళవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చిన్నఅమిరం జిల్లా పరిషత్ హైస్కూల్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు స్వయంగా నులిపురుగుల నివారణ మాత్రలను వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నులిపురుగులు ప్రమాదకరమని వీటివల్ల రక్తహీనతతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు. నులిపురుగుల నియంత్రణ చాలా కీలకమైన అంశం అని ఆమె అన్నారు. ఒకటి నుండి 19 సంవత్సరాల వయస్సులోపు కలిగిన పిల్లలందరూ తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోని ఆరోగ్యంగా ఉండాలన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమం సంవత్సరములో రెండుసార్లు ఫిబ్రవరి, ఆగస్టు మాసాల్లో ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. 19 సంవత్సరాలలోపు పిల్లలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. ఎక్కువగా ఆడపిల్లలు రక్తహీనతతో బాధపడుతుంటారని అన్నారు. రోడ్ల పక్కన ఫాస్ట్ ఫుడ్స్, అనారోగ్యమైన చిప్స్ ప్యాకెట్లు, తదితర పదార్థాలను తినకూడదని, వీటిలో ఏ విధమైన పోషక పదార్థాలు ఉండమని స్పష్టం చేశారు. రక్తహీనత కారణంగా ఆటలలోను, చదువులోను చురుకుగా ఉండలేరని, ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, వేరుసెనగ, నువ్వులు ఉండలు వంటి వాటితో పాటు, ఇంటిలో అమ్మ తయారుచేసిన పదార్థాలను మాత్రమే తీసుకోవాలన్నారు. ఈ మాత్రలను 1 – 5 సంవత్సరాల్లోపు గల పిల్లలకు అంగన్వాడి కేంద్రాల్లో, 6 – 19 వయసు గల పిల్లలకు, కిశోర బాలలకు పాఠశాలలు, కళాశాలలో అందజేయడం జరుగుతుంది అన్నారు. ఆడపిల్లలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతుంటారని వీటికి ప్రధాన కారణం జీర్ణ వ్యవస్థలో చేరిన నులిపురుగులు కారణమన్నారు. ఈ విషయంలో ఆడపిల్లలు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. వీటిని అరికట్టేందుకు నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ 400 మి.గ్రా మాత్రలను తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. దీనివలన రక్తహీనతను నివారించి పోషకాలను పెంపొందిస్తాయని అన్నారు. చదువుపై ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుందని, పనిచేయగలిగే సామర్థ్యం వస్తుందన్నారు. జిల్లాలో 1,621 అంగన్వాడీలోని 57,155 మంది పిల్లలకు, 2,294 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1-10 తరగతి చదువుతున్న 2,41,558 మంది పిల్లలకు, 143 ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న 52,334 మందికి, బయట బయట పిల్లలు 455 మందికి మొత్తం 3,51,502 మంది పిల్లలకు నులి పురుగుల నివారణ మాత్రలను అందించాలనే లక్ష్యంగా ఆగస్టు 12న కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ఏ కారణం చేతనైనా ఆగస్టు 12వ తేదీన డీవార్మింగ్ మాత్రలు వేయని పిల్లలకు ఆగస్టు 20వ తేదీన జరిగే మాప్ – అప్ రోజున వేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలులో చదువుకుంటున్న పిల్లలందరూ నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకునేలా సంబంధిత శాఖల అధికారులు శ్రద్ధ తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జి.గీతా బాయి, డీఈవో ఇ.నారాయణ, ఆర్.బి.ఎస్.కే స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ నాగలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి.అనురాధ, ఆర్.బి.ఎస్.కే పి.ఓ డాక్టరు ఎంవివిఎన్ రాజేష్, జిల్లా ఎపిడెమియోలజిస్ట్ డాక్టర్ జి.సుభాష్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏ.అరుణ రాణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.