Close

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.

Publish Date : 23/02/2026

అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలి.

నేడు పి జి ఆర్ ఎస్ లో 204 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్ లో 41 దరఖాస్తులు స్వీకరణ.

.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

జిల్లా కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పిడి కె సి హెచ్ అప్పారావు, జిల్లా కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎన్.వెంకటేశ్వరరావు, జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులకు నేరుగా తమ సమస్యలను విన్నవించుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. కొన్ని ప్రధాన సమస్యలపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నేరుగా ఆర్డీవోలు, తహసిల్దార్లతో వెబ్ఎక్స్ ద్వారా మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నేడు భూ సంబంధిత సమస్యలు, కొత్తగా వికలాంగ, వితంతు పెన్షన్లు, గృహ నిర్మాణం, ఇల్లు మంజూరు, సీనియర్ సిటిజన్స్ సమస్యలు, ఆరోగ్య అంశాలకు సంబంధించిన వివిధ సమస్యలపై ప్రజల నుండి పలు ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.

ఈ రోజు అందిన అర్జీలలో కొన్ని పిర్యాదులు ఈ విధంగా ఉన్నాయి.

భీమవరం మారుతి నగర్ 7వ వార్డుకు చెందిన బొక్క సత్యనారాయణ అర్జీ సమర్పిస్తూ తనకు బేతపూడి గ్రామంలో 94 సెంట్లు భూమి ఉందని, ఇటీవల చేసిన సర్వేలో నా భూమి 89 సెంట్లు మాత్రమే చూపిస్తున్నదని, 5 సెంట్లు భూమి తగ్గిందని తిరిగి సర్వే చేసి తగ్గిన 5 సెంట్లు కలిపి పట్టాదార్ పాస్ పుస్తకం ఇప్పించాలని కోరారు.

భీమవరం పట్టణం 17వ వార్డుకు చెందిన గురజాడ వరలక్ష్మి అర్జీ సమర్పిస్తూ, తాను భీమవరం ఎంఏ కేఏ ప్రాథమిక మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం పథకం వంట ఏజెన్సీగా 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నానని, తనను ప్రధానోపాధ్యాయులు కారణం లేకుండా వంట ఏజెన్సీ నుండి తొలగించారని, అధికారులు అనుమతి లేని వేరే వారితో వంట చేయించుకుంటున్నారన్నారని పీజిఆర్ఎస్ లో ఫిర్యాదు చేస్తే తిరిగి ఏజెన్సీలో చేర్చుకోమని చెప్పిన తనను చేర్చుకోలేదన్నారు. ఇటీవల తన భర్త చనిపోయారని, కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉందని, పించను కూడా మంజూరు కాలేదని, దయచేసి తిరిగి వంట ఏజెన్సీగా నియమించాలని కోరారు.

భీమవరానికి చెందిన గిరిగి రవి సత్యప్రసాద్ తనకు రెండు నెలల క్రితం హై బీపీ మెదడును నరం చిట్లి కుడి ప్రక్క కాలు, చెయ్యి పని చేయడం లేదని, తనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నానని దయచేసి పించను మంజూరు చేయాలని సమర్పించారు.

యనమదుర్రు గ్రామానికి చెందిన మండ సూర్యనారాయణ అర్జీని సమర్పిస్తూ, తనకు 86 సెంట్లు వ్యవసాయ భూమి ఉందని, 2009వ సంవత్సరంలో నా భార్య నుండి రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని, ఆ భూమి ఆన్లైన్లో 22a లో దేవస్థానం భూమిగా చూపిస్తున్నదని, దయచేసి నా భూమి 22ఎ నుండి తొలగించాలని కోరారు

భీమవరం మండలం చిన్న గురువుకు చెందిన గండికోట బాలాజీ అర్జీ సమర్పిస్తూ, వారి తల్లిగారు 6 వేలు వికలాంగ పించను పొందుతున్నారని, గత ఆరు సంవత్సరాలు నుండి ఇంటికే పరిమితమయ్యారని, దయచేసి 15 వేల రూపాయలు పించను మంజూరు చేయాలని కోరారు.

వశిష్ట ఇంగ్లీష్ మీడియం స్కూల్, దువ్వలో 3వ తరగతి చదువుతున్న వికలాంగ విద్యార్థి వీరమల్ల చేతన్ దుర్గకు స్కూల్ యాజమాన్యం పూర్తిగా ఉచిత విద్య, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించడం పట్ల స్కూల్ యాజమాన్యాన్ని జిల్లా కలెక్టర్ అభినందించారు. విద్యార్థి పాఠశాలలో ఉచితంగా చదువుకు, వాహన సౌకర్యం అందించేందుకు పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న డీఈవో ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

2.111