పిజిఆర్ఎస్ అర్జీదారులకు కూడా వీరవాసరం తులసి రాంబాబు నేటి సోమవారం నుండి మధ్యాహ్నం భోజనం అందజేత-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

రాంబాబును స్ఫూర్తిగా తీసుకొని దాతృత్వ హృదయం కలవారు పి-ఫోర్ కార్యక్రమానికి చేయూతనివ్వాలి..
సేవా తత్పరతతో మరింత మంది పి-ఫోర్ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.
భీమవరం కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్ అర్జీదారులకు ప్రతి సోమవారం వీరవాసరం తులసి రాంబాబుచే ఏర్పాటుచేయనున్న భోజన సదుపాయాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వీరవాసరం తులసి రాంబాబు ఇప్పటికే వీరవాసరం మండలంలోని 18 గ్రామాల్లో సుమారు 200 మందికి పైగా వయోవృద్ధులు, ఏ ఆధారం లేక వండుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి రెండు పూటలకు సరిపడా క్యారేజీని వారి ఇంటి వద్దకే అందజేయడం జరుగుతుందన్నారు. ఇటీవల వారి సేవా కార్యక్రమాలను స్వయంగా వెళ్లి పరిశీలించడం జరిగిందన్నారు. ప్రతి సోమవారం వివిధ ప్రాంతాల నుండి భీమవరం జిల్లా కలెక్టరేట్ పీజిఆర్ఎస్ కు వచ్చే 200 మంది అర్జీదారులకు కూడా మధ్యాహ్నం భోజనాన్ని అందజేయడానికి తులసి రాంబాబు ముందుకు వచ్చారని, ఈ పరిణామం అభినందించదగిన విషయం అన్నారు. రాంబాబు, వారి కుటుంబ సభ్యులు ఇటువంటి గొప్ప సేవా కార్యక్రమంలో పాలుపంచుకుని పేదల ఆకలిని తీర్చడం జిల్లాకే గర్వకారణంగా కొనియాడారు. తులసి రాంబాబు సేవా తత్పరతను స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలో దాతృత్వ హృదయము కలిగిన సంపన్న వర్గాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పి-ఫోర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాంబాబు సతీమణి మల్ల వరలక్ష్మీ, కుమార్తె గోవర్ధిని లను జిల్లా కలెక్టర్ శాలువా కప్పి అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, సతీమణి మల్ల వరలక్ష్మీ, కుమార్తె గోవర్ధిని, వివిధ శాఖల జిల్లా అధికారులు, పిజిఆర్ఎస్ అర్జీదారులు, తదితరులు పాల్గొన్నారు.