పరిశ్రమల స్థాపనకు అందిన ధరఖాస్తులకు నిర్ణీత గడువులోపుగా అనుమతులను మంజూరు చేయాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల స్థాయిని పెంచే ర్యాంపు (RAMP) పధకం అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.
పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడేలా ఉద్యమ్ (Udyam) వర్క్ షాపులు నిర్వహించాలి.
శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.
ముందుగా గత సమావేశంలో చర్చించిన అంశాలపై జిల్లా పరిశ్రమల అధికారి తీసుకున్న చర్యలను నివేదించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ర్యాంపు పథకం అనేది సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీని ముఖ్య ఉద్దేశం ఎంఎస్ఎంఈల స్థాయిని పెంచడం అన్నారు. జిల్లాలో ఈ పథకం అమలకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఉద్యమ్ నమోదు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఆన్లైన్ ఆధారిత విధానం అన్నారు. ఉద్యమ్ వర్క్ షాప్ ద్వారా ఉద్యమ్ నమోదుపై అవగాహన కల్పించడం, ఎం ఎస్ ఎం ఇ ల ప్రయోజనాలు వివరించాలన్నారు. వర్క్ షాప్ లు ఉపయోగకరంగా, ఫలప్రదంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి ఉద్యమ్, వెండర్ డెవలప్మెంట్ నైపుణ్యఅభివృద్ధి కార్యక్రమాలు ఎంతో కీలకమైనవని వీటిపై అవగాహన, నిపుణులకు శిక్షణ, లబ్ధిదారులకు ప్రయోజనం కలిగే విధంగా ఈ వర్క్ షాప్ లు నిర్వహించాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే కేవలం అనుమతులు ఇవ్వడం కాదని, పరిశ్రమలు ఎదగడానికి, తాము ఎదుర్కొనె అన్ని సమస్యలకు ప్రభుత్వ స్థాయిలో పరిష్కార మార్గాలు కల్పించడం అనే విశాల దృష్టితో వ్యవహరించవలసి ఉందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతమైన పారిశ్రామిక వాతావరణాన్ని కల్పించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు జిల్లాలో సెప్టెంబర్ నెలాఖరు నాటికి 28 ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వర్క్ షాప్ లు, 22 ఎంటర్ప్రెనేర్ షిప్ మరియు స్కిల్ డెవలప్మెంట్ వర్క్ షాపులు నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయి నుండి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు యూనిట్ల స్థాపన, పారిశ్రామిక పెట్టు బడులపై అవగాహన కల్పించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి అడుగు పెట్టాలనుకున్న వారికి ఆర్థిక ప్రాత్సాహాన్ని అందించేలా బ్యాంకర్లతో సమన్వయం చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జులై 3వ తేదీ నుండి ఇప్పటివరకు వివిధ శాఖల అనుమతుల కోసం 193 ధరఖాస్తులు రాగా 185 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, మరో 8 ధరఖాస్తులు పరిష్కరించవలసి ఉందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ప్రోత్సాహం ఎం ఎస్ ఎం ఈ వివిధ రాయితీ పాలసీ కింద 15 యూనిట్లకు 2 కోట్ల రూపాయలు మంజూరుకు అనుమతించడం జరిగిందన్నారు. పిఎంఈజీపి పథకం 2025 – 26 కింద యూనిట్ల స్థాపనకు 11 దరఖాస్తులను బ్యాంకులకు పంపడం జరిగిందని, 73 యూనిట్లు స్థాపించడం జరిగిందని, మిగిలినవి కూడా త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, తదితరులు పాల్గొన్నారు.