Close

పరిశ్రమలను ప్రమాదరహితంగా నిర్వహించేందుకు నిబంధనల మేరకు మాక్ డ్రిల్స్ నిర్వహించి కార్మికులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 04/02/2026

జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిల్లా క్రైసిస్ గ్రూప్ సమావేశంను గ్రూప్ సభ్యులు, పరిశ్రమల ప్రతినిధులులతో గూగుల్ మీట్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదకర కెమికల్స్ కలిగిన పరిశ్రమలు మూడు ఉన్నాయని వాటిలో తణుకు ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్, తణుకు జయలక్ష్మి ఫెర్టిలైజర్స్ నిర్వహణలో ఉన్నాయని, భీమవరం డెల్టా పేపర్ మిల్స్ లిమిటెడ్ మూసి వేయబడిందన్నారు. అలాగే 34 పరిశ్రమలు సాధారణ ప్రమాదాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. వీటిలో అమోనియం కెమికల్స్ ఫ్యాక్టరీ ప్రాంతం నుండి 1.5 కిలోమీటర్ల పరిధి దాటి విస్తరిస్తే జిల్లా యంత్రాంగం సంబంధిత అధికారులైన వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖ, రెవిన్యూ, పోలీస్ తదితర వర్గాలను వినియోగించి ప్రమాదాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో పరిశ్రమల ద్వారా ఏ విధమైన ప్రమాదాలు సంభవించలేదని, భవిష్యత్తులో కూడా పరిశ్రమల నిర్వహణ నిబంధనలను కచ్చితంగా పాటించి ప్రమాద రహిత జిల్లాగా ఉండేలా అధికారులు కృషి చేయాలి అన్నారు. జిల్లాలో ఉన్న 54 ప్రమాదకర పరిశ్రమలు ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ను సమర్పించాల్సి ఉందని, వీటిలో 49 పరిశ్రమలు ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ను సమర్పించడం జరిగిందన్నారు. మిగతా ఐదు పరిశ్రమలు పనిచేయడం లేదన్నారు. తనిఖీల్లో 43 పరిశ్రమల్లో గుర్తించిన లోపాలను సంబంధిత యాజమాన్యాలకు తెలియజేయడం జరిగిందన్నారు, వాటిలో 28 ఫ్యాక్టరీల యజమాన్యం లోపాలను సరిచేసి నివేదికను అందజేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన పరిశ్రమలు వెంటనే నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ప్రమాదకరమైన పరిశ్రమల్లో మాక్ డ్రిల్ ను నిర్వహించి కార్మికులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఫ్యాక్టరీలలో ప్రమాదాలను నివారించేందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసేలా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, భీమవరం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులతో ఒక కమిటీని నియమించడం జరిగిందన్నారు. భారీ ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఎదుర్కొనేందుకు పరిశ్రమల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలలో ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ ఆర్ డి ఎఫ్ బృందాలు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే పరిశ్రమల లోపల రక్షణ చర్యల ప్రణాళిక తో పాటు, పరిశ్రమల పరిసర ప్రాంతాల్లో తీసుకోవలసిన రక్షణ చర్యల ప్రణాళికను కూడా సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

జూమ్ కాన్ఫరెన్స్ లో విజయవాడ నుండి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె.శ్రీనివాసరావు పాల్గొనగా, జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, భీమవరం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జి.స్వాతి పాల్గొన్నారు.