Close

పట్టాదారు పాసు పుస్తకాలు వెరిఫికేషన్ వేగవంతం చేయాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 22/01/2026

పట్టాదారు పాస్ పుస్తకాల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం భీమవరం మండలం యనమదుర్రు గ్రామాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయంలో రెవిన్యూ అధికారులు, రైతులతో కలిసి మాట్లాడారు. మండలంలో రీ సర్వే పూర్తి అయిన యనమదుర్రు గ్రామంలో ఫిబ్రవరి 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు రైతులకు రాజముద్రతో కొత్త పట్టాదారుపాసు పుస్తకములను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. సంబంధిత అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రైతులతో నేరుగా మాట్లాడారు.
రైతుల వద్ద ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను పరిశీలించి, ఈ కేవైసీ వివరాలు సరిగ్గా నమోదైనది, లేనిది అడిగి తెలుసుకున్నారు. రికార్డులు ప్రకారం పట్టాదారు పాసు పుస్తకాల్లో రైతులకు సంబంధించిన పేర్లు, ఆధార్, ఖాతా పూర్తి సమాచారం కచ్చితంగ ఉన్నవా లేవా సరి చూసుకోవాలని అన్నారు. తప్పులు ఏమైనా ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకువెళ్లి సరి చేయించుకోవాలని సూచించారు.
రైతుల భూమి వివరాలు, ఆధార్ లింకేజీ, ఖాతా సమాచారం తదితర అంశాల్లో ఎలాంటి తప్పులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెరిఫికేషన్ సమయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను జాయింట్ కలెక్టర్ నేరుగా విని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వ పథకాలు సకాలంలో రైతులకు అందాలంటే పట్టాదారు పాస్ పుస్తకాల సమాచారం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వం భూ హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత నిస్తుందని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ఈ సందర్భంలో ఆర్డిఓ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసిల్దార్ రావి రాంబాబు, వీఆర్వో నాగరాజు, గ్రామ సర్పంచ్ బూరాబత్తుల రామమూర్తి, రైతులు పెచ్చెట్టి నాగేశ్వరరావు, మేకల బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.