Close

పట్టణ ప్రాంతాల్లో కూడా వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 18/04/2025

గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉచిత ఇసుక సరఫరా, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల ఫిల్లింగ్ యాక్షన్ ప్లాన్, త్రాగునీటి సరఫరా, సానుకూల ప్రజా అవగాహన, ఎంఎస్ఎమ్ఈల సర్వే మరియు నియోజకవర్గాలలో ఎంఎస్ఎమ్ఈ పార్కుల ఏర్పాటు, స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన వేసవి కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వేసవి నీటి ఎద్దడి ఉండే అవకాశం ఉన్న 332 మండలాల్లోని 3 వేల 438 ఆవాసాలను గుర్తించి 67.31 కోట్ల రూ.లతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేడి వాతావరణ పరిస్థితులు, వేడి గాలులు వీచే అవకాశం ఉందని కావున వేడి గాలుల పరిస్థితులను అధికమించేందుకు తగిన సంసిద్ధత ముందు జాగ్రత్త కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కలక్టర్లకు సిఎస్ సూచించారు. అంతేగాక తాత్కాలిక నీటి సరఫరా వ్యవస్థల పునరుద్ధరణ, మరమ్మత్తులు, తాగునీటి చెరువులను నీటితో నింపడం, చేతి పంపులకు మరమ్మత్తులు నిర్వహించడం ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లోను ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని సమ్మర్ స్టోరేజి ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని జలవనరుల శాఖతో సమన్వంయం చేసుకుని కాలువలకు అడ్డుకట్ట వేసి చెరుకువులకు నీటిని మల్ళించి వాటిని పూర్తిగా నీటితో నింపాలని అన్నారు. ఇదే సమయంలో అన్నిమంచినీటి పంపిణీ లైన్లు, పంపింగ్ మెయిన్‌లను పూర్తిగా తనిఖీ చేసి నీటి లీకేజీలను అరికట్టాలని, తాగునీటికి ఇబ్బంది గల ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలన్నారు. తాగునీటి పొదుపుగా వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం స్వర్ణాంధ్ర,స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ఆయన సమీక్షిస్తూ ప్రతినెలా స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని సక్రమంగా నిర్వహించడం ద్వారా కార్యాలయాలు,పరిసరాలన్నిటినీ పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని సిఎస్ విజయానంద్ చెప్పారు. ముఖ్యంగా వివిధ ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యర్ధాల (ఇ-వేస్ట్) సక్రమ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని దీనిపై ప్రజల్లో తగిన అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఈ-వ్యర్థాల సేకరణపై శిక్షణ ఇవ్వాలని తద్వారా ఈ-వ్యర్థాలను అన్ని విభాగాలలో గుర్తించి వాటిని సక్రమంగా పారవేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వారానికి ఒకసారి ఈ-వ్యర్థాల సేకరణ కార్యక్రమాలల్లో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని చెప్పారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, డిపిఓలతో ఇప్పటికే చర్చించడం జరిగిందని, గత మాసం మూడో శనివారం థీమ్ కు కొనసాగింపుగా చెత్త సేకరణ, కంపోస్టు లక్ష్యంగా కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి యు.ఎల్.బిలో కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి బి. రవికాంత్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి వై.దోసి రెడ్డి, జిల్లా విద్యుత్ శాఖ అధికారి రఘునాథ బాబు, తదితరులు పాల్గొన్నారు.