పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి సమర్పించి, నిబంధనల మేరకు రైతులకు సహాయం అందించేలా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు
గురువారం తాడేపల్లిగూడెం మండలంలోని కృష్ణాయ పాలెం, పెంటపాడు మండలంలోని రావిపాడు, గణపవరం మండలంలోని చిలకంపాడు గ్రామాలలో నేలకొరిగిన పంట పొలాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంలో రైతులు తమ ఆవేదన తెలియజేసుకున్నారు. వేలాది ఎకరాల్లో పంట నష్ట పోయామని, ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉందని, పంట తయారైన తర్వాత యంత్రం ద్వారా కొయ్యడం సాధ్యం కాదని, మనుషుల ద్వారా కోయిస్తే చాలా ఖర్చు అవుతుందని వాపోయారు. సుమారు 40 శాతం దిగుబడిని కోల్పోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పందిస్తూ రైతులకు ధైర్యం చెప్పారు. మీ సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి నిబంధనల మేరకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఎవరు అధైర్యపడవద్దని ప్రభుత్వం దీనిపై ఆలోచన చేసి సముచిత పరిష్కారం చేస్తుందన్నారు. రైతులు చాలా కష్టపడి పండించిన వరి నేలకొరగడంతో చాలా ఇబ్బంది పడుతున్నారని, కొంత పాలు పోసుకునే స్థితిలో ఉన్న వరి కంకులు అన్నీ కూడా భూమి మీద పడిపోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం పంట నష్టం వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశించడం జరిగిందని, ఈరోజు కూడా అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ జిల్లా కలెక్టర్ లతో రివ్యూ చేయడం జరిగిందన్నారు. ఏదైతే ఎన్యూమరేషన్ చేయాల్సి ఉందో ఐదు రోజుల్లోగా పూర్తి చేసి సమర్పించాలని ఆదేశించడం జరిగిందన్నారు. ప్రతి వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది అందరూ కూడా ఇదే పనిలో నిమగ్నమై ఎన్యువరేషన్ చేస్తున్నారనీ, కచ్చితంగా మీ అందరికీ అవసరమైన మేర సహాయాన్ని అందించడానికి మన ముఖ్యమంత్రి, ప్రభుత్వం ముందు ఉంటుందని తెలియజేశారు.
తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వాస్తవంగా తడిసిన ప్రతి గింజను కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నేను ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడటం జరిగిందని తెలిపారు. కొనుగోలు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయమని వారు చెప్పారన్నారు. రైతులెవరు అధైర్య పడవద్దని, ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంది అన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ప్రత్యేక స్థానం ఉందని, వారికి ఇబ్బంది కలిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి తప్పకుండా తగు న్యాయం చేస్తారని రైతులకు భరోసా ఇచ్చారు
ఈ సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తాడేపల్లిగూడెం ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భానో, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా సహకార శాఖ అధికారి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, సివిల్ సప్లైస్ ఎండి ఎండి ఇబ్రహీం, తహసిల్దార్లు ఏం.సునీల్ కుమార్, రాజ రాజేశ్వరి, వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ చైర్ పర్సన్ ములగల శివ కేశవ, స్థానిక నాయకులు వలవల బాబ్జి, ఆకాశపు స్వామి, డాక్టర్ పద్మనాభుని మురళీమోహన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.