Close

నేడు మహిళలు వ్యాపారవేత్తలుగా అడుగులు వేశారు అంటే డ్వాక్రా గ్రూపులు ఏర్పాటుకు ఆనాడు ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలే కారణం..

Publish Date : 24/01/2026

మహిళలు తడి చెత్త – పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం కూడా సమాజ సేవే …

నాగరిక సమాజంలో బహిరంగ మల, మూత్ర విసర్జన మానుకోవాలి…

ముఖ్యంగా పురుషులు బహిరంగ మూత్రవిసర్జన మానుకోవాలి… మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆలోచన చేయాలి

బహిరంగ మల మూత్ర విసర్జన కారణంగా భూమి, నీరు, గాలి కలుషితమై అనేక రోగాలకు కారణం అవుతున్నాయి

మోసాలకు గురి కాకుండా మహిళలు అందరూ తప్పనిసరిగా చదువుకోవాలి..

మహిళలు స్వసక్తితో ఎదగాలని ఆలోచన చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడో డ్వాక్రా, మెప్మా గ్రూపులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు…

భీమవరం పట్టణం 39 వ వార్డు దుర్గాపురం బి.వి.రాజు మున్సిపల్ స్కూల్ వద్ద స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో భాగంగా శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత మెప్మా మహిళలు ఏర్పాటు చేసిన సోర్స్.. రిసోర్స్ వస్తు ప్రదర్శనను జిల్లా కలెక్టర్ తిలకించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ చెత్త విభజన అనేది పరిశుభ్రతలో కీలకమైన అంశం అన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం కూడా మహిళలు సమాజ సేవ చేసినట్లేనని ప్రకటించారు. తడి చెత్తను ఇంట్లోనే వర్మీ కంపోస్ట్ గా రూపొందించి పూల, కూరగాయల మొక్కలకు వినియోగించి ఆర్థిక లాభాన్ని పొందవచ్చు అన్నారు. అలాగే ప్లాస్టిక్, మెటల్, రబ్బరు వంటివి వేరు చేసి మున్సిపల్, పంచాయతీ సిబ్బందికి అందజేయడం ద్వారా సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారని, తద్వారా డంపింగ్ ఇబ్బంది కూడా చాలా వరకు తగ్గుతుందని సూచించారు. మహిళలందరూ తప్పకుండా చదువుకోవాలని, సమాజంలో అనేక రకాలైన మోసాలు జరుగుతున్నాయని వీటన్నింటి నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే చదువు ఒక్కటే మార్గం అన్నారు. మహిళల సాధికారతకు పెద్దపీట వేసిన మన ముఖ్యమంత్రి సుమారు 30 సంవత్సరాల క్రితమే డ్వాక్రా, మెప్మా గ్రూపులు ఏర్పాటు ద్వారా మహిళలు చిరు వ్యాపారాలతో ఆర్థికంగా ఎదుగుతూ వ్యాపారవేత్తలుగా మారడానికి బాటలు వేశారన్నారు. నాగరిక సమాజంలో, ముఖ్యంగా పశ్చిమగోదావరి వంటి అభివృద్ధి చెందని జిల్లాలో బహిరంగ మలమూత్ర విసర్జన హేయమైన చర్యగా అభివర్ణించారు. పురుషులు బహిరంగ మూత్ర విసర్జన వలన మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రహించాలని మహిళలను గౌరవిస్తూ ఇటువంటి చర్యలకు స్వస్తి పలకాలన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన కారణంగా భూమి, నీరు, గాలి అన్ని కలుషితమై అనేక రోగాలకు కారణం అవుతున్నాయని, దీనిపై ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలన్నారు. మన ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోదని, మనతోపాటు మన వీధి, మన ఊరు ఉంచుకోవడం కూడా అభివృద్ధికి సూచిక అన్నారు. అప్పుడే మన కుటుంబంతో పాటు సమాజానికి కూడా మేలు చేసిన వారం అవుతాం అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కోట్లాది రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువస్తున్నారని, మన పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకే వారు నిరంతరం శ్రమిస్తున్నారని, వారి శ్రమకు సహకారంగా మనం పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ ని అందిస్తేనే పెట్టుబడిదారులు కూడా ముందుకు వస్తారని హితవు పలికారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా చీపురు పట్టి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వీధులను శుభ్రపరిచారు.

స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసర పరిసరాల పరిశుభ్రతపై జిల్లా కలెక్టర్ తో సహా అందరూ ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్టీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, భీమవరం మున్సిపల్ కమిషనర్ కే రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ ఎ.రాంబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సోమశేఖర్, మెప్మా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

1.11 1.22